Axis Bank Q2 Results: ఈ ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో (Q2FY23) యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు మార్కెట్ అంచనాలను దాటడమే కాదు, ఊహించనంత పెరిగి ఆశ్చర్య పరిచాయి. ప్రతీ సెగ్మెంట్‌లోనూ భేష్ అన్న రీతిలో బ్యాంక్ ఫలితాలు ఉన్నాయి. ఓవైపు లాభాలను భారీగా పెంచుకుని, మరోవైపు బ్యాడ్‌లోన్లను, ప్రొవిజన్లను తగ్గించుకుని బ్రహ్మాండమైన పనితీరును యాక్సిస్ బ్యాంక్ ప్రదర్శించింది.
70% లాభ వృద్ధి
Q2FY23లో యాక్సిస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ. 5,625.25 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ. 3,382.78 కోట్లతో పోలిస్తే ఇది 66.29% ఎక్కువ. స్వతంత్ర (స్టాండలోన్) ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 70% వృద్ధితో రూ. 5,329.77 కోట్లకు చేరింది. Q2లో స్వతంత్ర లాభం రూ. 4,400 కోట్ల రావచ్చని మార్కెట్ లెక్కలు వేసింది. గురువారం ఈ లెక్కలన్నీ తేలిపోయాయి.
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) కూడా భారీగా పెరిగింది. NIIలో 31% (YoY) వృద్ధితో రూ. 10,360 కోట్లను బ్యాంక్ మిగుల్చుకుంది. నికర వడ్డీ మార్జిన్ (NIM) 0.57% పెరిగి 3.96 శాతానికి చేరింది. ఫీజు ఆదాయం 20% వృద్ధిని నమోదు చేసింది.
భారీగా తగ్గిన ప్రొవిజన్స్
ఈ త్రైమాసికంలో ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడింది. క్రితం ఏడాదితో పోలిస్తే, స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) 3.53 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గాయి. జూన్ త్రైమాసికంలో (Q1FY23) ఇవి 2.76 శాతంగా ఉన్నాయి. YoY, QoQ ప్రాతిపదిన నిరర్ధర ఆస్తులు తగ్గడం శుభ పరిణామం. దీంతో, కేటాయింపులు (Provisions) రూ. 1735 కోట్ల నుంచి అతి భారీగా తగ్గి రూ. 549 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ బ్యాంక్ స్టాక్‌కు ఇది బిగ్ పాజిటివ్ ట్రిగ్గర్.
మొండి బకాయిలు, ఆకస్మిక నిధి కోసం చేసే ముందస్తుగా చేసే రక్షణాత్మక కేటాయింపులు (Provisions) ఏడాది క్రితం రూ.1,735 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పడిపోయాయి. సెప్టెంబర్ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.5%కి పడిపోయింది. జూన్ త్రైమాసికంలోని 2.76% నుంచి, ఏడాది క్రితం సెప్టెంబర్ త్రైమాసికంలోని 3.53% నుంచి ఇది భారీగా తగ్గింది.
నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ రేషియో 0.51% వద్దకు దిగి వచ్చింది. క్రితం త్రైమాసికంలోని 0.64%, ఏడాది క్రితం త్రైమాసికంలోని 1.08% కంటే ఇప్పుడు తక్కువగా ఉంది.
పెరిగిన రైట్-ఆఫ్స్
సెప్టెంబర్ 30 నాటికి, యాక్సిస్ బ్యాంక్ కోవిడ్-19 సంబంధిత రుణాల్లో రూ. 46.14 కోట్లను రద్దు చేసింది. ఏప్రిల్-సెప్టెంబర్‌లో రూ. 652.6 కోట్ల విలువైన కోవిడ్ సంబంధిత రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. ఇది కాస్త ఆందోళనకర అంశం
రిటైల్ రుణాలు గత ఏడాది కంటే 22% పెరిగాయి. చిన్న- మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలు 28% పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.