India May Ban Rice Exports: దేశంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడం వల్ల, ఈ ఏడాది జూన్‌ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. అంతకుముందు, వరుసగా నాలుగు నెలల పాటి తగ్గిన ఇన్‌ఫ్లేషన్‌, జూన్‌లో పుంజుకుంది. అసలే ఇది ఎల్‌ నినో కాలం. అంటే, కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమయంలో ద్రవ్యోల్బణం రేట్‌ పెరగడంతో సెంట్రల్‌ గవర్నమెంట్‌ అలెర్ట్‌ అయింది.


బియ్యం ఎగుమతులపై నిషేధం!
ఇటీవలి నెలల్లో ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా, దేశ ప్రజల ప్రధాన ఆహారమైన బియ్యం రేట్లు పైపైకి పాకుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు రైస్‌ రేట్లకు కళ్లెం వేయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది. 


బ్లూంబెర్గ్ రిపోర్ట్‌ ప్రకారం, అన్ని బాస్మతీయేతర బియ్యం రకాల ఎక్స్‌పోర్టులపై నిషేధం విధించే ప్రతిపాదన సెంట్రల్‌ గవర్నమెంట్‌ టేబుల్‌పై ఉంది. బాస్మతీయేతర బియ్యం రకాల ఎగుమతులను ప్రభుత్వం నిషేధిస్తే, మొత్తం బియ్యం ఎగుమతుల్లో 80 శాతం ఆగిపోతుంది. ఆ రైస్‌ మొత్తం దేశీయ మార్కెట్‌లోకి వస్తుంది. లోకల్‌ మార్కెట్‌లో సప్లై పెరగడం వల్ల ధరల పెరుగుదల ఆగిపోవడంతో పాటు, రేట్లు దిగి వస్తాయి కూడా. 


బియ్యం కొనే ప్రతి ఒక్కరికీ, ఈ మధ్య కాలంలో రేట్లు ఏ రేంజ్‌లో పెరిగాయో తెలుసు. దేశీయ మార్కెట్‌లో గత రెండు వారాల్లోనే బియ్యం ధరలు 20 శాతం మేర పెరిగాయి. 


అక్కడ అతివృష్టి-ఇక్కడ అనావృష్టి
ఈ సీజన్‌లో, ఉత్తరాది రాష్ట్రాల్లో అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా పూర్తి స్థాయిలో వానలు మొదలు కాలేదు. ఇలాంటి పరిస్థితులు వరి దిగుబడిపై ప్రభావం చూపుతాయి. ఇది, భవిష్యత్తులోనూ బియ్యం రేట్లపై ఒత్తిడి పెంచవచ్చు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. దేశీయంగా ముఖ్యమైన ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ రేట్లను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నూకల ఎగుమతులపై (broken rice) 2022లో బ్యాన్‌ విధించింది. వైట్ రైస్‌, బ్రౌన్ రైస్ ఎగుమతులపై 20 శాతం సుంకం విధించారు. దేశీయంగా సరఫరా పెంచడానికి గోధుమలు, చక్కెర ఎక్స్‌పోర్ట్స్‌ మీద కూడా పరిమితులు పెట్టింది.


ఈ ఎల్‌ నినో టైమ్‌లో, ఇండియా నుంచి రైస్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచంలో బియ్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశం భారత్‌. గ్లోబల్‌ రైస్‌ ట్రేడ్‌లో ఇండియా వాటా దాదాపు 40%. 2022లో భారతదేశం మొత్తం 56 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు భారత్ బియ్యాన్ని సరఫరా చేస్తోంది.


ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది బియ్యం అన్నం తింటారు. ప్రపంచంలోని రైస్‌ కన్జంప్షన్‌లో ఆసియా వాసులదే 90% వాటా. ఎల్‌ నినో నేపథ్యంలో ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దిగుమతి దేశాలు ఈ సంవత్సరం దూకుడుగా బియ్యాన్ని నిల్వ చేస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ రిపోర్ట్‌ ప్రకారం, వరి పండించే దేశాల్లో కరవు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న భారత ప్రభుత్వ ఆలోచన, ప్రపంచ దేశాల్లో ఆందోళనలు పెంచుతోంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial