Amul Milk : దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. అమూల్ కింద ఉన్న బ్రాండ్ లలోని పలు పాల రకాలపై లీటర్ పై ఏకంగా రూ.1 తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా ధృవీకరించారు. ఈ ధర తగ్గింపు ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా దేశ వ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. మిగతా పాల వేరియంట్ల ధరల్లో మార్పు ఉండదని చెప్పారు. కాగా 2024 జూన్ నెలలో అమూల్ పాల ధరలను లీటరుకు రూ.2 తగ్గించింది.
అమూల్ ఈ బ్రాండ్ల పాల ధరలపై రూ.1 తగ్గింపు
గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) తాజా నిర్ణయంతో అమూల్ టీ స్పెషల్, అమూల్ తాజా, అమూల్ గోల్డ్ పాల ధర లీటర్ కు రూ.1 తగ్గింది. మొన్నటిదాకా అమూల్ టీ స్పెషల్ పాల లీటర్ ప్యాకెట్ ధర రూ. 62 ఉంటే ఇప్పుడది రూ.61కి చేరింగి. అలాగే అమూల్ తాజా పాల ధర లీటర్‌కు రూ. 54 నుంచి రూ. 53కి, అమూల్ గోల్డ్ మిల్క్ ధర రూ. 66 నుంచి రూ. 65కి చేరింది. రాష్ట్రంలోని డెయిరీలు పాలతో నిండిపోవడం, అనేక సభ్య సంఘాలు పాడి రైతులకు చెల్లించే పాల సేకరణ ధరలను తగ్గించడంతో జీసీఎంఎంఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్ద ప్యాకెట్ పాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా చెప్పారు. డెయిరీ రంగంలో పోటీతత్వాన్ని బలోపేతం చేస్తూ అమూల్ పాలపై ధరల తగ్గింపు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నామన్నారు. ఈ సర్దుబాటు కేవలం అమూల్ టీ స్పెషల్, అమూల్ గోల్డ్, అమూల్ తాజా వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. మిగతా బ్రాండ్ల ధరల్లో ఎలాంటి మార్పులుండవన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పాడి పరిశ్రమ సహకార సంస్థ
జీసీఎంఎంఎఫ్ గత ఆర్థిక సంవత్సరంలో సగటున రోజుకు 310 లక్షల లీటర్ల పాలను సేకరించగా, దీని మొత్తం వార్షిక పాల ప్రాసెసింగ్ సామర్థ్యం దాదాపు 500 లక్షల టీలర్లు. ఇది గుజరాత్ లోని 18,600 గ్రామాలలోని 36 లక్షల రైతులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రైతు యాజమాన్యంలోని పాడి పరిశ్రమ సహకార సంస్థ కావడం చెప్పుకోదగిన విషయం. ఇందులోని 18 సభ్యుల సంఘాలు రోజుకు 300 లక్షల లీటర్ల పాలను సేకరిస్తాయి. అంతేకాదు అంతర్జాతీయ వ్యవసాయ కంపారిజన్ నెట్వర్క్ (IFCN) ప్రకారం, మిల్క్ ప్రాసెసింగ్ పరంగా ఇది ప్రపంచంలోని టాప్ 20 డెయిరీ కంపెనీలలో 8వ స్థానంలో ఉంది. దేశంలోనే కాకుండా దాదాపు 50 దేశాలకు పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ ఈ సంస్థ అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థగా నిలిచింది.
Also Read : 'టెట్' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాల నమోదుకు అవకాశం, ఫలితాలు ఎప్పుడంటే?