Airfares Are Came Down This Year Around Diwali: ప్రతి సంవత్సరం దసరా (Dasara 2024), దీపావళి (Diwali 2024) పండుగల సీజన్‌లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడతాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఛార్జీలు పెరుగుతాయి. ముఖ్యంగా, ఫ్లైట్ టిక్కెట్ రేట్లు పెరుగుతాయి. ఫెస్టివ్ సీజన్‌లో, తరచుగా, ప్రజలు సాధారణం కంటే రెట్టింపు ఛార్జీలతో విమానాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. కానీ, ఈ సంవత్సరం దీపావళి సీజన్‌లో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. విమాన చార్జీలు భారీగా తగ్గాయి. దీనిని, విమాన ప్రయాణికులందరికీ దీపావళి కానుకగా చెప్పుకోవచ్చు. చమురు ధరల తగ్గుదల నుంచి ఫ్లైట్ పాసెంజర్లు ప్రయోజనం పొందుతున్నారు. అంతేకాదు, విమానయాన సంస్థల సామర్థ్యం పెరుగుదల, సర్వీసుల సంఖ్య పెరగడం కూడా ఎయిర్ ట్రావెలర్స్‌కు కలిసొచ్చింది. 2023లో దీపావళి సీజన్ కోసం నవంబర్ 10-16 తేదీలను లెక్కలోకి తీసుకుంటే, ఈ ఏడాది పండుగ తేదీలు మారాయి కాబట్టి అక్టోబర్ 28 - నవంబర్ 03ను దీపావళి సీజన్‌గా ఎంచుకున్నారు.
దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో (Ixigo) రిపోర్ట్ ప్రకారం... దేశంలోని వివిధ మార్గాల్లో విమాన ఛార్జీలు 20 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గాయి. వన్-వే జర్నీల విషయంలో ఛార్జీల్లో డిస్కౌంట్ లభించింది. ఒక నెల క్రితం చేసిన బుకింగ్స్ ఆధారంగా, ఇక్సిగో ఈ నివేదికను సిద్ధం చేసింది. నివేదిక ప్రకారం, బెంగళూరు - కోల్‌కతా మార్గంలో గరిష్ట ఛార్జీలు తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణ ధర రూ. 10,195. ఈ ఏడాది కేవలం రూ. 6,319 కే ప్రయాణించవచ్చు. ఈ రెండు నగరాల మధ్య విమాన ధరలు గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 38 శాతం తగ్గాయి.
పెద్ద నగరాల మధ్య 30% పైగా తగ్గింపు
చెన్నై - కోల్‌కతా వెళ్లే మార్గంలో విమాన ఛార్జీలు దాదాపు 36 శాతం తగ్గాయి. గత ఏడాది రూ. 8,725 గా ఉన్న ఎయిర్ ఫేర్ ఈ ఏడాది రూ. 5,604 మాత్రమే ఖర్చవుతోంది. ముంబై - దిల్లీ మధ్య ఛార్జీలు కూడా దాదాపు 34 శాతం తగ్గాయి. గతేడాది ఈ రెండు నగరాల మధ్య విమాన ఛార్జీ రూ. 8,788 ఉండగా, ప్రస్తుతం రూ. 5,762 గా ఉంది. దిల్లీ - ఉదయ్‌పూర్ మధ్య విమాన టిక్కెట్ రేటు గతేడాది నాటి రూ. 11,296 నుంచి ఇప్పుడు రూ. 7,469 కి తగ్గింది. గత దీపావళి సీజన్‌తో పోలిస్తే ఈసారి దాదాపు 34 శాతం క్షీణత నమోదైంది. దిల్లీ - కోల్‌కతా, హైదరాబాద్ - దిల్లీ, దిల్లీ - శ్రీనగర్ రూట్లలోనూ ఛార్జీలు దాదాపు 32 శాతం తగ్గాయి.
ఇక్సిగో గ్రూప్ CEO అలోక్ బాజ్‌పాయ్ చెప్పిన ప్రకారం... గత ఏడాది ఇదే సమయంలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్ నిలిచిపోయాయి. అంతేకాదు, విమాన చమురు (ATF) ధరలు కూడా గతేడాది కంటే ఇప్పుడు దాదాపు 15 శాతం తక్కువగా ఉన్నాయి. అందువల్లే చాలా దేశీయ రూట్లలో విమాన టిక్కెట్ రేట్లు తగ్గాయి.
కొన్ని మార్గాల్లో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
అయితే, ఛార్జీలు పెరిగిన ఆకాశ మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో... అహ్మదాబాద్-దిల్లీ రూట్‌లో 34 శాతం ఛార్జీలు పెరిగాయి. గతేడాది ఈ మార్గంలో టికెట్ కోసం రూ. 6,533 వెచ్చించగా, ఈసారి రూ. 8,758 చెల్లించాల్సి వచ్చింది. ముంబై-డెహ్రాడూన్ మార్గంలో రూ. 11,710 నుంచి రూ. 15,527కి ఎయిర్ ఫేర్ పెరిగింది. ఇది దాదాపు 33 శాతం జంప్.
మరో ఆసక్తికర కథనం: ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌లుగా కార్లు, బైకులు - జాబ్ చేస్తే ఇలాంటి కంపెనీలోనే చేయాలి