DGCA New Order To Airlines: విమాన ప్రయాణం చేసే 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త నిబంధన తీసుకొచ్చింది. అటు పిల్లలకు - ఇటు తల్లిదండ్రులకు ఊరట కలిగించే విషయం ఇది. 


12 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, వారు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులపాటే కలిసి ప్రయాణించేలా చూడాలని విమానయాన సంస్థలను DGCA ఆదేశించింది. ఒకే PNR నంబర్‌లో విమానయానం చేసే పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో ఒకరు లేదా సంరక్షుడి పక్కన సీట్‌ కేటాయించాలని సూచించింది. దీంతో పాటు, ఈ ఏర్పాటుకు సంబంధించిన రికార్డును కూడా ఎయిర్‌లైన్ కంపెనీలు నిర్వహించాలని డీజీసీఏ ఉత్తర్వు జారీ చేసింది.


ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్ కింద ఆర్డర్ జారీ
2024 సంవత్సరానికి సంబంధించిన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్ (ATC)-01 కింద జారీ చేసిన ఈ ఉత్తర్వులో, "12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో ఒకరి పక్కన కచ్చితంగా సీటు కేటాయించాలి" అని ఉంది. 


ఫిర్యాదులు పెరగడంతో కీలక నిర్ణయం
విమాన ప్రయాణికుల మధ్య, ముఖ్యంగా గుంపులుగా ప్రయాణించే వారి మధ్య పిల్లలను విడిగా కూర్చోబెడుతున్నారని తల్లిదండ్రుల నుంచి DGCAకి ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి. ప్రయాణీకులు, తాము కోరుకున్న సీటు కోసం అదనంగా చెల్లించడానికి నిరాకరిస్తే ఇలా జరుగుతుంది. తాజాగా.. ఓ చిన్నారి తన తల్లిదండ్రుల నుంచి విడిగా కూర్చొని విమాన ప్రయాణం సాగించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.


మరో ఆసక్తికర కథనం: ఆపిల్‌ సంస్థ బంపరాఫర్ - భారత్‌లో వచ్చే మూడేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు! 


సాధారణంగా, విమాన ప్రయాణంలో వెబ్‌ చెక్‌ ఇన్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఆ సమయంలో, నచ్చిన సీటును ప్రయాణికుడు ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికోసం ప్రయాణీకుడు కొంత ఎక్కువ డబ్బు చెల్లించాలి. ఒకవేళ ఈ ఆప్షన్‌ను ఎంచుకోకపోతే ఆటో సీట్‌ అసైన్‌మెంట్‌ రూల్‌ వర్తిస్తుంది. అంటే, ఆటోమేటిక్‌గా సీటు కేటాయింపు జరుగుతుంది. ఈ సందర్భంలో పిల్లలు, తల్లిదండ్రులు/సంరక్షుకులు విడివిడిగా కూర్చుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. పిల్లలు విడిగా, ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రయాణీకుల మధ్య కూర్చున్నప్పుడు, చిన్నారుల భద్రత విషయంలో తల్లిదండ్రులు/సంరక్షుకులు ఆందోళన చెందుతున్నారు.


DGCA కొత్త నిబంధన ప్రకారం 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు తల్లిదండ్రులు/సంరక్షుకుల పక్కనే కచ్చితంగా సీటు ఏర్పాటు చేయాలంటే, విమానయాన సంస్థలకు కాస్త సన్నద్ధత అవసరం. టికెట్‌ బుకింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో అవి కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.


పిల్లల విషయంలో ఎయిర్‌లైన్స్‌ కంపెనీలను కంట్రోల్‌లో పెట్టిన డీజీసీఏ, విమాన సంస్థలకు కొన్ని ఊరటలు కూడా ఇచ్చింది. జీరో బ్యాగేజీ, సీట్ల ప్రాధాన్యం, ఆహారం/చిరుతిళ్లు/ పానీయాలు, సంగీత వాయిద్యాలను తీసుకెళ్లడానికి ఛార్జీలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. అయితే, ఇది ఐచ్ఛికంగా జరగాలని, తప్పనిసరి చేయకూడదని తన ఆదేశాల్లో స్పష్టంగా వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి