Godrej Group Split: 127 చరిత్ర ఉన్న గోద్రేజ్ గ్రూప్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. రెండుగా విడిపోతున్నట్టు ప్రకటించింది. Godrej Enterprises, Godrej Industries సంస్థలు 127 ఏళ్లుగా కలిసే ఉన్నాయి. ఇకపై ఈ రెండు కంపెనీలు విడివిడిగా పని చేయనున్నాయి. ప్రస్తుత వారసులు వీటిని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. సబ్బులు, హోమ్ అప్లియెన్సస్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం వరకూ అన్నింటినీ సమానంగా పంచుకున్నారు. ఆది గోద్రేజ్, ఆయన సోదరుడు నదీర్‌ గోద్రేజ్ ఇండస్ట్రీస్ వ్యవహారాలు చూసుకోనున్నారు. వీళ్లిద్దరి కజిన్స్ జంషేద్ గోద్రేజ్, స్మితా గోద్రేజ్ Godrej & Boyce కంపెనీ బాధ్యతలు తీసుకోనున్నారు. Godrej Enterprises Groupలో Godrej & Boyce తో పాటు అనుబంధ సంస్థలుంటాయి. ఇందులో ఏరోస్పేస్ నుంచి ఏవియేషన్, డిఫెన్స్, ఐటీ సాఫ్ట్‌వేర్, ఫర్నిచర్‌ ఇండస్ట్రీలున్నాయి. ఈ సంస్థలన్నింటికీ జంషేద్ గోద్రేజ్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఆయన సోదరి నైరికా హోల్కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ముంబయిలో 3,400 ఎకరాల భూమి కూడా వీళ్ల పరిధిలోనే ఉండనుంది. ఇక Godrej Industries Groupలో గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ సహా మరో రెండు సంస్థలు ఈ పరిధిలో ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఇకపై ఆది, నదీర్‌ అధీనంలో ఉంటాయి. ఈ మేరకు గోద్రేజ్ ఫ్యామిలీ కీలక ప్రకటన చేసింది. కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు, విభేదాలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 


"కుటుంబంలో ఎలాంటి విభేదాలు రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై వ్యూహాత్మకంగా ముందడుగు వేసేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నాం. షేర్‌ హోల్డర్స్‌లో విశ్వాసం పెంచాలన్నదే మా ఉద్దేశం"


- గోద్రేజ్