వంట నూనెల తయారీ సంస్థ అదానీ విల్మర్ నేడు స్టాక్ మార్కెట్లో నమోదైంది. ఇష్యూ ధర 230తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో మొదలైంది. మరికాసేపటికే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో 17 శాతం వరకు పుంజుకుంది. ప్రస్తుతం రూ.40 లాభంతో 270 వద్ద ట్రేడ్ అవుతోంది.
అదానీ విల్మర్ 3.91 శాతం డిస్కౌంట్‌తో రూ.221 వద్ద బీఎస్‌ఈలో నమోదైంది. ఇక ఎన్ఎస్‌ఈలో 1.30 శాతం డిస్కౌంట్‌తో రూ.227 వద్ద మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పుంజుకొంది. సింగపూర్‌కు చెందిన విల్మర్ గ్రూప్, భారత్‌లోని అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్‌గా అదానీ విల్మర్‌ను స్థాపించారు. ఫార్చూన్ బ్రాండ్‌తో ఇది వంట నూనెలను విక్రయిస్తోంది. మధ్యాహ్నం షేర్ల ధర పెరగడంతో బీఎస్‌ఈ ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.31,770 కోట్లకు చేరుకుంది.
Also Read: ఐపీవో క్రేజ్ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!
ఈ కంపెనీ ఐపీవోకు మంచి స్పందనే లభించింది. 17 రెట్లు ఎక్కువగా ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఐపీవో ధరల శ్రేణిని రూ.218-230 మధ్య నిర్ణయించింది. మొత్తంగా ఇప్పుడు 12 శాతం ప్రజలకు మిగతా 88లో ఇద్దరు ప్రమోటర్లకు చెరిసగం వాటా ఉండనుంది. ఇష్యూ ద్వారా సేకరించిన డబ్బులో రూ.1900 కోట్లను క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రూ.1058 కోట్లను రుణాల చెల్లింపునకు, రూ.450 కోట్లను పెట్టుబడులు, విలీనాల కోసం వినియోగించనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో అదానీ విల్మర్ ఆదాయం రూ.24,957 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.16,273 కోట్లుగా ఉండేది. ఇక లాభం రూ.288 కోట్ల నుంచి రూ.357 కోట్లకు పెరిగింది. మొత్తంగా 2020-21లో కంపెనీ రాబడి రూ.37,195 కోట్లు కాగా లాభం రూ.728 కోట్లుగా ఉంది. వంట నూనెలు మాత్రమే కాకుండా బియ్యం, గోధుమ పిండి, చక్కెర, సబ్బులు, హ్యాండ్ వాష్‌లు, శానిటైజర్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.
Also Read: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత
Also Read: 75 ఏళ్ల క్రితం 'ఎయిర్ ఇండియా' పేరు నిర్ణయించిన తీరు తెలిస్తే.. సర్‌ప్రైజ్ అవుతారు!