Adani stocks: ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ఎంట్రీ మార్కెట్‌ను ఎలా మార్చేస్తుందో అన్న విషయాన్ని, స్టార్ NRI ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ ‍‌(Rajiv Jain) మరోమారు నిరూపించారు. అదానీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన కేవలం రెండు రోజుల్లోనే రూ. 3,100 కోట్ల లాభాన్ని ఆయన సంపాదించారు.


రాజీవ్ జైన్ యాజమాన్యంలోని జీక్యూజీ పార్టనర్స్ (GQG Partners), సమస్యల్లో ఉన్న అదానీ స్టాక్స్‌లో రూ. 15,446 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టింది. బాగా పతనమై, ఆకర్షణీయంగా మారిన ధరల దగ్గర నాలుగు స్టాక్స్‌లో వాటాలు సొంతం చేసుకుంది. రాజీవ్‌ జైన్‌ పెట్టుబడుల తర్వాత అదానీ స్టాక్స్‌ ఉవ్వెత్తున ఎగిశాయి. దీంతో, రెండు రోజుల వ్యవధిలోనే జీక్యూజీ పార్టనర్స్‌  20% లేదా రూ. 3,100 కోట్లకు పైగా రాబడి సొంతం చేసుకుంది.


₹18,548 కోట్లకు చేరిన పెట్టుబడుల విలువ
ఈ లాభాల తర్వాత... అదానీ ఎంటర్‌ప్రైజెస్ ‍‌(Adani Enterprises), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (Adani Ports and Special Economic Zone), అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్‌లో (Adani Transmission) జైన్ పెట్టుబడుల మార్కెట్ విలువ రూ. 18,548 కోట్లకు పెరిగింది.


హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ‍‌(Hindenburg Research) రిపోర్ట్‌ చేసిన నష్టం తర్వాత, అదానీ స్టాక్‌లలో నెల రోజుల పాటు పతనం కొనసాగింది. GQG పార్టనర్స్ చేసిన కొనుగోళ్లు, ఇన్వెస్టర్ రాజీవ్ జైన్ చేసిన వ్యాఖ్యలతో అదానీ స్టాక్స్‌లో పతనానికి ఇప్పుడు దాదాపు అడ్డుకట్ట పడ్డట్లే కనిపిస్తోంది. గౌతమ్ అదానీ గ్రూప్‌ను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నానని, ఈ గ్రూప్‌ కంపెనీలకు అద్భుతమైన దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉన్నాయని, గతంలో స్టాక్‌ వాల్యూయేషన్లు ఎక్కువగా ఉండడం వల్ల దూరంగా ఉన్నానని రాజీవ్‌ జైన్‌ చెప్పారు. అదానీ స్టాక్స్‌ క్రాష్ వల్ల, ఆకర్షణీయమైన ధర వద్ద "అద్భుతమైన ఆస్తులను" పొందినట్లు జైన్ వెల్లడించారు.


వరుస బ్లాక్ డీల్స్‌లో, గురువారం (02 మార్చి 2023) నాడు, రూ. 1,410.86 ధర వద్ద అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను జీక్యూజీ పార్టనర్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ కౌంటర్‌ 33% పెరిగింది. ఈ నిఫ్టీ స్టాక్‌లో రాజీవ్‌ జైన్‌ కంపెనీకి రూ. 1,813 కోట్ల లాభం వచ్చింది.


అదేవిధంగా అదానీ పోర్ట్స్‌ ఒక్కో షేరును రూ. 596.2 ధర వద్ద, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను రూ. 504.6 ధర వద్ద, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లను రూ. 668.4 ధర వద్ద కొనుగోలు చేశారు.


సొంత స్టాక్‌లో సీన్‌ రివర్స్‌
విచిత్రం ఏంటంటే... రాజీవ్‌ జైన్‌ కొనుగోళ్ల తర్వాత అదానీ స్టాక్స్‌ రాకెట్ల దూసుకెళ్తే, GQG పార్ట్‌నర్స్‌ షేర్లు మాత్రం పతననాన్ని చవి చూశాయి. శుక్రవారం 3% దిగువన ముగిశాయి.


గ్రూప్‌ చేసిన కొన్ని అప్పులను క్లియర్ చేయడానికి అవసరమైన డబ్బుల కోసం, అదానీ గ్రూప్‌ ప్రమోటర్ ఎంటిటీ అయిన SB అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ తన స్టేక్‌లో కొంత వాటాను ఈ FIIకి (జీక్యూజీ పార్టనర్స్)  విక్రయించింది.


2023 జనవరి చివరి నుంచి, అదానీ గ్రూప్‌లోని 10 అదానీ స్టాక్స్‌ ఉమ్మడి మార్కెట్ విలువ సగానికి పైగా తగ్గింది, మొత్తం రూ. 10.65 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. GQG డీల్‌ జరగడం, కొన్ని రుణాల ముందస్తు చెల్లించడానికి అదానీ గ్రూప్‌ చేస్తున్న ప్రయత్నాల నడుమ గత నాలుగు రోజులుగా అదానీ స్టాక్స్‌ లాభపడ్డాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.