SC Verdict on Adani Group-Hindeburg Research Case: అదానీ - హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఇప్పటి వరకు సాగిన సెబీ (SEBI) దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసులో దర్యాప్తును సిట్ (Special Investigation Team) లేదా సీబీఐ (CBI)కి అప్పగించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము నియమించిన నిపుణుల కమిటీ దర్యాప్తును కూడా సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలనూ తోసిపుచ్చింది. దర్యాప్తును బదిలీ చేయాలన్న పిటిషనర్ వాదనల్లో బలం లేదని స్పష్టం చేసింది.
మొత్తం 24 కేసుల్లో, 22 కేసుల్లో ఇప్పటికే సెబీ దర్యాప్తు పూర్తయింది, ఆ నివేదికను సెబీ గతంలోనే సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇప్పటి వరకు జరిగిన సెబీ దర్యాప్తులో ఎలాంటి లోపం కనిపించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. తద్వారా, ప్రశాంత్ భూషణ్ సహా ఇతర పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. మిగిలిన 2 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు సెబీకి మరో 3 నెలల సమయం ఇచ్చింది. పెట్టుబడిదార్లకు కేంద్ర ప్రభుత్వం, సెబీ రక్షణ కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
సుప్రీంకోర్టు తీర్పు వివరాలు
అదానీ కేసులో, సెబీ దర్యాప్తు ప్రకారం, FPI (Foreign Portfolio Investments) నిబంధనలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో తమకు పరిమిత అధికారాలు ఉన్నాయని, వాటి ఆధారంగా విచారణ జరిపామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి ఈ కోర్టు అధికారం పరిమితమని చెప్పింది. అంటే, SEBI అధికార పరిధిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని అర్ధం. మిగిలిన కేసుల్లోనూ దర్యాప్తును సెబీనే పూర్తి చేస్తుందని, సిట్‌కు అప్పగించబోమని కోర్టు పేర్కొంది.
మీడియా రిపోర్ట్‌లు లేదా వార్తల ఆధారంగా నమ్మకం ఉంచలేమని, వాటి ద్వారానే కేసును నడిపించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదానీ కేసును సిట్‌కు బదిలీ చేసేందుకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పింది. కేసును ఏ దర్యాప్తు కమిటీకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తాము గుర్తించినట్లు వెల్లడించింది.
గౌతమ్ అదానీకి ఉపశమనం (Relief for Gautham Adani)
అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్, తన రిపోర్ట్‌లో చేసిన ఆరోపణలపై ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేవని గత విచారణలోనే కోర్టు చెప్పింది. ఇప్పుడు, 22 కేసుల్లో సెబీ చేసిన దర్యాప్తును సమర్థించడం, ఈ కేసు దర్యాప్తును సిట్ లేదా సీబీఐకి అప్పగించకపోవడాన్ని చూస్తే... అదానీ గ్రూప్ కంపెనీల యజమాని గౌతమ్ అదానీకి ఇది పెద్ద రిలీఫ్.
ఏడాది క్రితం ఇదే నెలలో (జనవరి 24, 2023), గౌతమ్ అదానీ & అదానీ గ్రూప్ మీద అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అదానీ కంపెనీల షేర్లలోకి వచ్చిన పెట్టుబడుల్లో అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపించింది. దీని ద్వారా, షేర్ ధరలను తారుమారు చేస్తూ మోసం చేశారంటూ పెద్ద బాంబ్ పేల్చింది.
అదానీ కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులపై విచారణ జరిపించడంతో పాటు, ఎవరికి ఎలాంటి లాభాలు వచ్చాయో కూడా తేల్చాలని కోరుతూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. సెబీ, తన విచారణను సక్రమంగా నిర్వహించడం లేదని, ఈ కేసును సిట్‌కు బదిలీ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో విచారణ 2023 నవంబర్ వరకు కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, నవంబర్ 24న, తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ఆ తీర్పు వెలువడింది.
మరో ఆసక్తికర కథనం: దిగొచ్చిన పసిడి నగల రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి