Adani Group Hindeburg Research Case: ఈ రోజు (బుధవారం, 03 జనవరి 2023) మార్కెట్‌(Stock Markets)లో దమ్ము లేకపోయినా, అదానీ గ్రూప్(Adani Group ) స్టాక్స్‌ దుమ్ము రేపుతున్నాయి. దీనికి కారణం సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు. అదానీ గ్రూప్ - హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ కేసు(Adani Group Hindeburg Research Case)లో సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం అదానీ గ్రూప్‌నకు అనుకులంగా వస్తుందన్న అంచనాలతో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్‌ సహా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ అన్నీ ఈ రోజు దూసుకెళుతున్నాయి, ప్రారంభ ట్రేడింగ్‌లో 16 శాతం వరకు పెరిగాయి.


నవంబర్ 24న తీర్పు రిజర్వ్ 
అదానీ గ్రూప్‌ కంపెనీల్లో అవకతవకలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేస్తూ, అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఏడాది క్రితం ఇదే నెలలో (2023 జనవరి) ఒక రిపోర్ట్‌ రిలీజ్‌ చేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక దెబ్బ అదానీ గ్రూప్‌నకు గట్టిగా తలిగింది. నివేదిక వచ్చిన తర్వాత, గ్రూప్‌లోని అన్ని కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి, చాలా స్టాక్స్‌ సగానికి పైగా తగ్గాయి. 


అదానీ గ్రూప్‌ మీద హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఆ తర్వాత, హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI), అదానీ గ్రూప్‌ మీద దర్యాప్తు ప్రారంభించింది. సుప్రీంకోర్టు స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించింది. ఇదే కేసులో, వివిధ కోణాల్లో విచారణలను కోరుతూ అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అదానీ గ్రూప్ - హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ కేసులో 2023 నవంబర్‌ వరకు విచారణ కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం, నవంబర్ 24న, తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు ఏడాది నాటి హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ రోజు వెలువడనుంది. 


పోటెత్తిన అదానీ షేర్లు
అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 షేర్లు ఈ రోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఓపెనింగ్‌ సెషన్‌లో, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అత్యధికంగా 16% పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్, NDTV 10% జంప్‌ చేశాయి. అదానీ విల్మార్, అదానీ గ్రీన్ 7-8% వరకు బలపడ్డాయి.


అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ కూడా ప్రారంభ ట్రేడ్‌లో 7% పైగా పెరిగింది. అదానీ పోర్ట్స్ దాదాపు 6% గెయిన్‌ అయింది. అదానీ పవర్ దాదాపు 5% బలాన్ని కూడగట్టింది. అదానీ గ్రూప్‌లోని రెండు సిమెంట్ స్టాక్స్ ACC, అంబుజా సిమెంట్ షేర్ల ధరలు కూడా 3% చొప్పున పెరిగాయి.


ఈ రోజు ఉదయం 10 గంటలకు.... అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.3,165 (7.95%); అదానీ గ్రీన్ రూ.1,730.65 (7.99%); అదానీ పోర్ట్స్ రూ.1,138.70 (5.70%); అదానీ పవర్ రూ.544.60 (4.98%); అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ.1,230.45 (15.99%); అదానీ విల్మార్ రూ.3,94.50 (7.53%); అదానీ టోటల్ గ్యాస్ రూ.1,100.65 (10%); ఏసీసీ రూ.2330.25 (2.75%); అంబుజా సిమెంట్ రూ.547.00 (3.15%); ఎన్‌డీటీవీ రూ.300.60 (10.58%) వద్ద ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: 300 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌, 21,600 దిగువన నిఫ్టీ, రాకెట్లలా మారిన అదానీ స్టాక్స్‌