Pushpa 2 Pre-release Business: 2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో 'పుష్ప 2' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే, కచ్ఛితంగా రికార్డ్ బ్రేకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని ఊహించవచ్చు. అందుకే దీనికి తగ్గట్టుగానే థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ పెద్ద మొత్తాన్ని కోట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు అంత డబ్బు వెచ్చించడానికి ఆలోచిస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.


కరోనా పాండమిక్ ఫస్ట్ వేవ్ తర్వాత 'పుష్ప: ది రైజ్' సినిమా రిలీజ్ అయింది. విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, కోవిడ్ పరిమితులు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కమర్షియల్ సక్సెస్ సాధించింది. ముఖ్యంగా నార్త్ లో ఊహించని విధంగా వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఓటీటీలోకి వచ్చిన తర్వాత అనూహ్య స్పందన లభించింది. ఎక్కడ చూసినా పుష్పరాజ్ మ్యానియా కనిపించింది. దీంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇదంతా 'పుష్ప: ది రూల్' పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.


'పుష్ప 2' చుట్టూ నెలకొన్న హైప్ ని బట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాదు, KGF చాప్టర్ 2 ను కూడా బీట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ లో టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో బన్నీ మేకర్స్ థియేట్రికల్ హక్కుల కోసం రూ. 200 కోట్లు కోట్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లోని 6 ఏరియాస్ కోసం మేకర్స్ 100 కోట్లు కోట్ చేస్తున్నారట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్రాంతి రిలీజులు కాకుండా మిగిలిన సినిమాలకు ఏపీలో 60 కోట్ల షేర్ రాబట్టడం కష్టమైన పని. ఈ నేపథ్యంలోనే మైత్రీ మూవీ మేకర్స్ అడిగినంత చెల్లించడానికి బయ్యర్లు ఆసక్తి చూపడం లేదనే టాక్ నడుస్తోంది.


Also Read: టాలీవుడ్@2024 - ఈ ఏడాది రిలీజయ్యే క్రేజీ చిత్రాలివే!


ఇప్పటి వరకూ ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ మాత్రమే థియేట్రికల్ రైట్స్ రూపంలో 200 కోట్లు రాబట్టింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' సినిమా రైట్స్ రూ.160 కోట్ల వరకూ లాక్ చేయబడ్డాయి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో బ్రేక్ ఈవెన్ సాధించేందుకు కష్టపడుతుందని వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు 'పుష్ప: ది రూల్' కోసం సలార్ కంటే 40 కోట్లు ఎక్కువ కోట్ చేస్తున్నారట. అయితే 'పుష్ప' పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద విజయం సాధించలేదనే సంగతి తెలిసిందే. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ కూడా అందుకోలేదు. అందుకే ఇప్పుడు 'పుష్ప 2' హక్కుల విషయంలో ఆంధ్రా బయ్యర్లు రిస్క్ తీసుకోలేకపోతున్నారట. నైజాం రీజియన్‌లో మాత్రం రూ.70-75 కోట్లకు ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ కావచ్చని అంటున్నారు.


కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో మొదటి భాగాన్ని మించి ఉండేలా 'పుష్ప' పార్ట్ 2 ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2024 ఆగస్టు 15న భారీఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.


Also Read: బాక్సాఫీస్ వద్ద కాటేరమ్మ కొడుకు ప్రభంజనం - రూ.650 కోట్ల దిశగా దూసుకుపోతున్న 'సలార్'