AdaniConneX Fund Raising: ఇటీవలి కాలంలో, అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలు బిజినెస్‌ పెంచుకునే ప్లాన్‌లో బిజీగా ఉన్నాయి. ఇందుకు అవసరమైన డబ్బు కోసం ఫండ్‌ రైజింగ్‌కు వెళ్తున్నాయి. అదానీ గ్రూప్‌లోని అదానీ కనెక్స్‌ (AdaniConneX) కూడా ఇప్పుడు అదే బాటలో ఉంది. వ్యాపారం కోసం వేల కోట్ల రూపాయలు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. దీనికోసం వివిధ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. ఫండ్‌ రైజింగ్‌ పథకానికి సంబంధించిన షరతులపై కంపెనీ - బ్యాంకుల మధ్య ఒప్పందం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.


ET రిపోర్ట్‌ ప్రకారం, అదానీ కనెక్స్ ఎనిమిది విదేశీ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. 900 నుంచి 950 మిలియన్‌ డాలర్లు (రూ. 7,500 కోట్ల నుంచి రూ. 7,920 కోట్ల వరకు) సమీకరించే చర్చలు చివరి దశకు చేరాయి. ఈ డబ్బు విడతల వారీగా 6 సంవత్సరాలు పాటు విదేశీ రుణం రూపంలో సమీకరించనున్నట్లు ఈటీ రిపోర్ట్‌లో ఉంది. అప్పు కోసం అదానీ కంపెనీ మాట్లాడుతున్న బ్యాంకుల్లో MUFG బ్యాంక్, సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్‌ (Sumitomo Mitsui Banking Corp), స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ‍‌(Standard Chartered Bank) కూడా ఉన్నాయి.


ఎంత వడ్డీకి అప్పు తీసుకుంటోంది?
వివిధ బ్యాంకులతో రుణ ఒప్పందాలపై ఈ వారంలోనే అదానీ కనెక్స్ సంతకం చేసే ఛాన్స్‌ ఉంది. ఈ లోన్ వడ్డీ రేట్లు 'సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేట్' ‍(SOFR) కంటే 250 నుంచి 260 బేసిస్‌ పాయింట్లు (2.50 నుంచి 2.60 శాతం) ఎక్కువగా ఉండొచ్చు. సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేటు ప్రస్తుతం 5.31 శాతంగా ఉంది. అంటే అదానీ కంపెనీ విదేశీ బ్యాంకుల నుంచి దాదాపు 5.5 శాతం వడ్డీ రేటుతో ఈ నిధులను పొందవచ్చు.


అదానీ ఎంటర్‌ప్రైజెస్ జాయింట్ వెంచర్
అదానీ కనెక్స్ అనేది.. అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎడ్జ్ కనెక్స్ మధ్య జాయింట్ వెంచర్. ఈ వెంచర్‌లో రెండు కంపెనీలకు సరిసమానంగా 50-50 శాతం వాటా ఉంది. భారతదేశంలో డేటా సెంటర్ వ్యాపారం కోసం ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వర్ధమాన వ్యాపారం కోసం అదానీ గ్రూప్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది.


అదానీ కనెక్స్, రాబోయే పదేళ్లలో, దేశంలోని వివిధ నగరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. హైదరాబాద్, చెన్నై, నోయిడా, పుణె నగరాల్లో ఈ డేటా సెంటర్లను కంపెనీ ఏర్పాటు చేయనుంది. వివిధ బ్యాంకుల నుంచి సేకరిస్తున్న నిధులను డేటా సెంటర్‌ ఏర్పాటుకు మాత్రమే కంపెనీ వినియోగిస్తుంది. తాజా ఫండ్‌ రైజింగ్‌కు ముందు, గత సంవత్సరం 213 మిలియన్‌ డాలర్ల నిధులను అదానీ కనెక్స్ సేకరించింది.


ఈ రోజు (సోమవారం, 22 ఏప్రిల్‌ 2024) ఉదయం 9.45 గంటల సమయానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధర (Adani Enterprises Share Price) 0.40% పెరిగి రూ.3,039 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: అమిత్‌ షా పోర్ట్‌ఫోలియోలో 180 కంపెనీలు - స్టాక్‌ మార్కెట్‌పై ఇంత పట్టుందా?