Amit Shah Stock Market Investments: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు స్టాక్‌ మార్కెట్‌లో కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు మాత్రమే కాదు, బాండ్లు, డిబెంచర్లు కూడా కేంద్ర హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. అమిత్‌ షా దగ్గర ఉన్న స్టాక్స్‌ చాలా వరకు పెద్ద కంపెనీలవే. అమిత్‌ షా సతీమణి సోనాల్ అమిత్ భాయ్ షాకు కూడా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారు.


2024 ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, అమిత్ షా దగ్గర పదో, పదిహేనో కాదు.. ఏకంగా 180 లిస్టెడ్ కంపెనీల షేర్లు ఉన్నాయి. 


అమిత్‌ షా టాప్‌ హోల్డింగ్స్‌
అమిత్‌ షా పెట్టుబడుల్లో టాప్‌-5 చూస్తే... హోల్డింగ్‌లలో హిందుస్థాన్ యూనిలీవర్‌లో రూ. 1.4 కోట్ల విలువైన షేర్లు, MRFలో రూ. 1.3 కోట్లు, కోల్‌గేట్ పామోలివ్ (ఇండియా)లో రూ. 1.1 కోట్లు, ప్రోక్టర్ & గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్‌లో రూ. 0.96 కోట్లు, ABB ఇండియాలో రూ. 0.7 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. కేంద్ర హోం మంత్రి పోర్ట్‌ఫోలియో మొత్తం విలువ రూ. 17.4 కోట్లు కాగా, మొదటి ఐదు హోల్డింగ్స్‌ విలువ రూ. 5.4 కోట్లు లేదా మూడింట ఒక వంతు. అమిత్‌ షా ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన ప్రకారం 2024 ఏప్రిల్ 15 నాటికి ఉన్న విలువ ఇది.


ITC, VIP ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్‌వెల్ నార్టన్, కమిన్స్ ఇండియా, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్‌లోనూ భారీ సంఖ్యలో షేర్లు ఉన్నాయి. 2024 ఏప్రిల్ 15 నాటి ధరల ప్రకారం, ఈ కంపెనీల్లో రూ. 0.4 కోట్ల నుంచి రూ. 0.7 కోట్ల విలువైన షేర్లు ఉన్నారు.


అమిత్‌ షా పోర్ట్‌ఫోలియోలో లిస్టెడ్‌ కంపెనీలే కాదు, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీలు కూడా ఉన్నాయి, వాటి విలువ రూ. 3 లక్షలు.


అమిత్‌ షా సతీమణి దగ్గర 80 లిస్టెడ్ కంపెనీల షేర్లు
తన జీవిత భాగస్వామి సోనాల్ అమిత్‌భాయ్ షా హోల్డింగ్స్‌ వివరాలను కూడా ఎన్నికల అఫిడవిట్‌లో అమిత్‌ షా వెల్లడించారు. ఆమె దగ్గర దాదాపు 80 లిస్టెడ్ కంపెనీల షేర్లు ఉన్నాయి, వాటి మొత్తం విలువ రూ. 20 కోట్లు. సోనాల్ అమిత్‌భాయ్ షా పెట్టుబడుల్లో టాప్‌-5 కంపెనీలు - సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌లో రూ. 1 కోటి విలువైన షేర్లు, కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ. 1.9 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌లో రూ. 1.3 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ. 3 కోట్లు, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్‌లో రూ. 1.8 కోట్లు, లక్ష్మి మెషిన్ వర్క్స్‌లో రూ. రూ. 1.8 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అమిత్‌ షా సతీమణి కూడా అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో వాటాలు కొన్నారు, ఆ వాటాల మొత్తం విలువ రూ. 83,845.


ఐదేళ్ల క్రితం (2019) ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 21.96 కోట్ల విలువైన షేర్లు, బాండ్లు, డిబెంచర్లను అమిత్‌ షా ప్రకటించారు. అప్పటికి ఇప్పటికి పెద్దగా మార్పులు లేవు. ఐదేళ్ల క్రితం హిందుస్థాన్ యూనిలీవర్‌లో రూ. 84 లక్షల విలువైన 5,000 షేర్లు ఉంటే, ఇప్పుడు రూ.1.4 కోట్ల విలువైన 6,176 షేర్లకు ఈ లెక్క పెరిగింది. ఇతర టాప్ హోల్డింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు.


2019 అఫిడవిట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 2,450 షేర్లు ‍(అప్పటి లెక్క ప్రకారం రూ.8 లక్షలకు పైగా విలువ) ఉన్నట్లు అమిత్‌ షా ప్రకటించారు. 2024 అఫిడవిట్‌లో రిలయన్స్ షేర్లను చూపలేదు, అయితే తన సతీమణికి రూ. 3.4 లక్షల విలువైన 117 షేర్లను ఉన్నట్లు చూపారు.


తాజా అఫిడవిట్‌ ప్రకారం, అమిత్‌ షా దంపతుల పెట్టుబడుల్లో దాదాపు 60% స్టాక్‌ మార్కెట్‌లోనే ఉంది. 


2024 ఎన్నికల్లో, భారతీయ జనత పార్టీ (BJP) అభ్యర్థిగా గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి అమిత్ షా నామినేషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలిచారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు! ఓ మహిళ మృతితో సంచలనం - కంపెనీకి షాక్ ఇచ్చిన కోర్టు