Adani Green Energy: చైనా వలలో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటోంది. పైగా భారతదేశంలో ఇందుకోసం తన నిరంతర సహాయాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం అక్కడ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు కొన్ని ఇండియన్ కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. 


శ్రీలంకకు ప్రముఖ కంపెనీలు వ్యాపారాన్ని విస్తరించటం అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచటమే కాక.. ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదలకు కొత్త పెట్టుబడులు సహాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ శ్రీలంకలో విండ్ ఎనర్జీ ఉత్పత్తి ఫామ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. లంకలోని ఈశాన్య ప్రాంతంలో 484 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధి శ్రీలంక ప్రభుత్వం, అదానీ గ్రీన్ ఎనర్జీ మధ్య 20 ఏళ్ల  పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ద్వీపదేశం ఆమోదం తెలిపింది.


కిలోవాట్ అవర్ టారిఫ్ రేటు 0.0826 డాలర్లుగా నిర్ణయించినప్పటికీ చెల్లింపు రోజున మారకపు రేటుకు అనుగుణంగా స్థానిక రూపాయిల్లో ఈ మెుత్తాన్ని శ్రీలంక ప్రభుత్వం చెల్లించనుంది. క్యాబినెట్ నోట్ ప్రకారం మన్నార్, పూనేరిన్‌లలో 484 మెగా వాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి ఇప్పటికే మార్చి 2022లోనే క్యాబినెట్ ఆమోదం లభించింది. ప్రస్తుతం అదానీ గ్రీన్ కంపెనీతో జరిగిన ఒప్పందం తర్వాత అదానీ గ్రూప్ ఇచ్చిన ప్రతిపాదనను మూల్యాంకనం చేసేందుకు మంత్రుల కేబినెట్ ఒక చర్చల కమిటీని సైతం ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా చివరి ధర $8.26గా ఆమోదించాలని విద్యుత్ శాఖ మంత్రి పంపిన తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


మార్కెట్ల ట్రేడింగ్ సమయంలో ఈ వార్త వెలువడటంతో అదానీ గ్రీన్ షేర్లు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.1,790 స్థాయికి చేరినప్పటికీ.. చివరికి మార్కెట్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కారణంగా షేర్ ధర ఎన్ఎస్ఈలో రూ.1,722 వద్ద ముగిసింది. దీనికి ముందు సైతం అదానీ గ్రూప్ తన వ్యాపారాలను శ్రీలంకలో కలిగి ఉంది. 2023లో అమెరికా ప్రభుత్వం మద్దకు కలిగిన ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్.. అదానీ పోర్ట్స్‌ శ్రీలంకలో నిర్మిస్తున్న కంటైనర్ టెర్మినల్ కోసం సుమారు 553 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. 2022లో అప్పుల ఊబిలో చిక్కుకుని దివాలీ తీసిన శ్రీలంక ఇంధన చెల్లింపులకు, విద్యుత్ అవసరాలకు చెల్లించేందుకు విదేశీమారక నిల్వలు క్షీణతతో చాలా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. కీలోమీటర్ల మేర వాహనాలు అక్కడి పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టిన సంఘటనలు ఇప్పటికీ అక్కడి ప్రజలకు గుర్తున్నాయి. ఈ క్రమంలో లంకదేశం తన ఖర్చులను తగ్గించుకునేందుకు గ్రీన్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. తాజా పరిణామం సైతం ఇందులో భాగమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.