Adani - Ambuja Cements: అప్పులను ముందే తీర్చేస్తామని మాట ఇచ్చిన గౌతమ్ అదానీ, అందుకు అవసరమైన డబ్బుల కోసం నానా తంటాలు పడుతున్నారు. మూడు రోజుల క్రితమే, గ్రూప్‌లోని రెండు కంపెనీల నుంచి మరికొన్ని షేర్లను తాకట్టు పెట్టిన అదానీ.. ఇప్పుడు మరో కంపెనీ షేర్లను అమ్మకానికి పెట్టారు.
అంబుజా సిమెంట్స్‌లో వాటా విక్రయానికి ఏర్పాట్లు
గత ఏడాది కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీ అంబుజా సిమెంట్స్‌లో (Ambuja Cements) వాటాలను విక్రయించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది. అంబుజా సిమెంట్ ప్రమోటర్స్‌గా ఉన్న అదానీ ఫ్యామిలీకి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVs), షేర్లను విక్రయించడానికి రుణదాతల నుంచి అనుమతి కోరాయి.
అంబుజా సిమెంట్స్‌లో 4.5 శాతం వాటాను సెకండరీ మార్కెట్లో బ్లాక్ డీల్ ద్వారా అదానీ గ్రూప్ విక్రయించవచ్చు.
అంబుజా సిమెంట్స్ షేర్లను విక్రయించడం ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించాలని అదానీ గ్రూప్ భావిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్‌లో, అంబుజా సిమెంట్స్ షేర్ రూ. 378.35 వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం 4.5 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 3381 కోట్లను ఈ గ్రూప్ సమీకరించవచ్చు.
అంబుజా సిమెంట్స్‌లో 63.18 శాతం వాటా
అదానీ ఫ్యామిలీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అయిన హోల్డెరిండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (Holderind Investments Ltd), ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ (Endeavour Trade and Investment Ltd) ద్వారా అంబుజా సిమెంట్స్, ACCలో వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. హోల్డర్‌ఇండ్‌కు అంబుజా సిమెంట్స్‌లో 63.18 శాతం వాటా ఉండగా, ఎండీవర్‌కు 0.04 శాతం వాటా ఉంది. తద్వారా, ప్రమోటర్‌కు మొత్తం 63.22 శాతం వాటా వచ్చింది.
2022 మే నెలలో, హోల్సిమ్ ఇండియా నుంచి అంబుజా సిమెంట్స్ & ACCని 10.5 బిలియన్ డాలర్ల విలువకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇందులో ప్రమోటర్లు 3 బిలియన్ డాలర్ల వాటా పొందారు. ఈ కొనుగోలు కోసం గ్రూప్‌లోని ఇతర కంపెనీల షేర్లను తాకట్టు పెట్టింది. దీని ద్వారా 1.1 బిలియన్ డాలర్లను సమీకరించింది. మరో 4.50 బిలియన్ డాలర్ల రుణాన్ని 14 అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్ తీసుకుంది.
శుక్రవారం ట్రేడింగ్‌లో... అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.90% నష్టంతో రూ. 1896.45 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ 5% చొప్పున లాభంతో అప్పర్ సర్క్యూట్ కొట్టాయి. అదానీ పవర్ 4.69% పెరగ్గా, అదానీ పోర్ట్స్ స్వల్పంగా 0.09% లాభపడింది. ఎన్‌డీటీవీ 4.90%, అదానీ విల్మర్ 4.47%, అంబుజా సిమెంట్స్ 1.66%, ఏసీసీ 0.70% నష్టపోయాయి. ఈ నెల ప్రారంభం నుంచి అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ.1.7 లక్షల కోట్ల మేర పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.