Adani Group: మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగిపోతోంది. అదానీ అనుకోవటం దేశంలో అది జరగకపోవటం అనే మాట లేకుండా పోయింది. దేశంలోనే కాక విదేశాలకు సైతం అదానీ గ్రూప్ ప్రస్తుతం తన వ్యాపారాలను వేగంగా విస్తరిస్తోంది. ఇదే క్రమంలో గ్రూప్ వ్యాపారాలపై వచ్చిన అన్ని ఆరోపణలపై క్లీన్ చిట్ కూడా తెచ్చేసుకుంది. ప్రధానంగా అదానీ బొగ్గు దిగుమతి సప్లై వ్యాపారం గురించి చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. తక్కువ రేటుకు తెచ్చిన బొగ్గును బహిరంగ మార్కెట్ల కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు సైతం వచ్చాయి. అధిక రేటు ఉన్నప్పటికీ అదానీ వద్ద తప్పక కోల్ కొనాల్సిందే అనే విధంగా రూల్స్ పెద్ద చర్చకు తెరలేపాయి. 


తాజాగా ఈ వ్యవహారంలో ఒక నివేదిక సంచలనంగా మారిపోయింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థ తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(Tangedco)తో తన ఒప్పందంలో తక్కువ గ్రేడ్ బొగ్గు ధరను పెంచింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCRP) పత్రాలతో ఫైనాన్షియల్ టైమ్స్ ఈ నివేదికను ప్రచురించింది. అదానీ గ్రూప్ మోసం చేయడం ద్వారా భారీ లాభాలను సంపాదించి ఉండవచ్చని నివేదిక పేర్కొంది. విద్యుత్ కోసం తక్కువ నాణ్యత గల బొగ్గును ఉపయోగించడం అంటే ఎక్కువ ఇంధనాన్ని కాల్చడమని అందరికీ తెలిసిందే. 


జనవరి 2014లో అదానీ ఇండోనేషియాకు చెందిన బొగ్గును కొనుగోలు చేసిందని నివేదిక పేర్కొంది. MV కల్లియోపి ఎల్ ద్వారా రవాణా చేయబడిన ఈ షిప్‌మెంట్ తరువాత టాంగెడ్కోకు 6,000 క్యాలరీల బొగ్గుగా విక్రయించబడిందని నివేదిక పేర్కొంది. 6,000 కేలరీల బొగ్గు ఇంధనం విద్యుత్ తయారీకి అత్యంత విలువైన కేటగిరీల్లో ఒకటి కాబట్టి అదానీ గ్రూప్ తక్కువ క్వాలిటీ బొగ్గును అధిక ధరకు విక్రయించి డబ్బు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తక్కువ కేలరీల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన మైనింగ్ గ్రూప్ నుండి అదానీ గ్రూప్ తక్కువ ధరకు ఇండోనేషియా బొగ్గును కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక్కడ ఇండోనేషియా నుంచి అదానీ గ్రూప్ 3,500 కేలరీల నాణ్యత విద్యుత్తును 6000 క్యాలరీల నాణ్యమైన బొగ్గుగా చూపిందని ఆరోపణలు ఉన్నాయి. 


అయితే అదానీ పెద్ద బొగ్గు కుంభకోణానికి పాల్పడిందా అనే విధంగా వస్తున్న కథనాలపై అదానీ ఖండించారు. బొగ్గు లోడింగ్ అండ్ డిశ్చార్జ్ సమయంలో కస్టమ్స్ అధికారులు, టాంగెడ్కో శాస్త్రవేత్తలు స్వతంత్రంగా బొగ్గు నాణ్యతను పరీక్షించారని కంపెనీ ప్రతినిధి ఆరోపణలపై వివరణ ఇచ్చారు. సరఫరా చేయబడిన బొగ్గు అనేక ప్రదేశాలలో బహుళ ఏజెన్సీల నాణ్యత తనిఖీ ప్రక్రియను ఆమోదించింది కాబట్టి.. నాసిరకం బొగ్గు ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా అదానీ గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. 2018లో చెన్నైకి చెందిన NGO అరపోర్ ఇయక్కమ్ " బొగ్గు ఇన్‌వాయిస్ స్కామ్" అని ఆరోపించింది. తంగెడ్కో "బొగ్గు కోసం మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించింది" అని తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేసింది.


ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అదానీ గ్రూప్ బొగ్గు వ్యాపారంలో అవకతవలు జరిగాయని చేసిన ఆరోపణలు ఇప్పుడు తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అదానీ గ్రూప్ బొగ్గు దిగుమతుల విషయంలో ఓవర్ ఇన్‌వాయిసింగ్ మోసాలకు పాల్పడిందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక అదానీ గ్రూప్ బొగ్గు అధిక రేటుకు విక్రయ కథనంలో జనవరి 2014కు సంబంధించిన ఇన్‌వాయిస్ గురించి పేర్కొంది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ఆరోపించిన కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కావటం పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇది అదానీని కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోదీ రక్షిస్తున్నారని చేస్తున్న ఆరోపణలకు పూర్తి విరుద్ధంగా ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.