Net Worth Of Top-5 Richest In The World: బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2025, ప్రపంచంలోని అగ్ర ఆస్తిపరుల జాబితాను విడుదల చేసింది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్‌, లారీ ఎల్లిసన్‌ సహా అనేక మంది దిగ్గజ వ్యాపారవేత్తలు & పారిశ్రామికవేత్తల పేర్లు ఆ లిస్ట్‌లో ఉన్నాయి. చాలా దేశాల GDPలు కూడా వీళ్ల దగ్గర ఉన్న సంపద కంటే తక్కువగా ఉండడం విశేషం.


ప్రపంచంలో టాప్‌-5 సంపన్నులు (Top 5 richest people in the world)


నంబర్ వన్ ఎలాన్‌ మస్క్


మార్చి 10 నాటి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం, ప్రపంచంలోని అత్యధిక నికర విలువ ‍‌(Net Worth) కలిగిన వ్యక్తుల జాబితాలో ఎలాన్‌ మస్క్ నంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఎలాన్‌ మస్క్ ఒక అమెరికన్ వ్యాపారవేత్త. అతని ఆధ్వర్యంలో అనేక పెద్ద వ్యాపారాలు, ప్రాజెక్టులు నడుస్తున్నాయి. టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ సహా మరికొన్ని సంస్థలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, 10 మార్చి 2025 నాటికి మస్క్ నికర విలువ ‍‌(Elon Musk Net Worth) $330 బిలియన్లు. బ్లూమ్‌బెర్గ్ ప్రతిరోజూ ప్రపంచంలోని అగ్రశ్రేణి ధనవంతుల జాబితాను నవీకరిస్తుంది.


మార్క్ జుకర్‌బర్గ్‌కు సెకండ్‌ ర్యాంక్‌


మార్క్ జుకర్‌బర్గ్ కూడా అమెరికన్ వ్యవస్థాపకుడు & సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ మెటా సహ వ్యవస్థాపకుడు. ఆయనను భవిష్యత్ బిల్ గేట్స్ అని కూడా పిలుస్తారు. 2010లో, అమెరికన్ మ్యాగజైన్ టైమ్స్ మార్క్‌ను 2010 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ (Mark Zuckerberg Net Worth) $221 బిలియన్లు.


థర్డ్‌ ప్లేస్‌లో జెఫ్ బెజోస్ 


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2025 ప్రకారం, టాప్‌ నెట్‌వర్త్‌ కలిగిన వ్యక్తుల జాబితాలో  జెఫ్ బెజోస్‌ మూడో స్థానంలో ఉన్నారు. జెఫ్ బెజోస్ ఒక వ్యాపారవేత్త, మీడియా యజమాని, పెట్టుబడిదారుడు & వ్యోమగామి. జెఫ్ బెజోస్ Amazon.com వ్యవస్థాపకుడు & బోర్డు ఛైర్మన్. 2018లో, ఫోర్బ్స్ జెఫ్ బెజోస్‌ను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 10 మార్చి 2025 నాటికి జెఫ్ బెజోస్ నికర విలువ (Jeff Bezos Net Worth) $220 బిలియన్లు. 


నాలుగో పేరు బెర్నార్డ్ ఆర్నాల్ట్ 


బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2025 నికర విలువ కలిగిన వ్యక్తుల జాబితాలో బెర్నార్డ్ నాల్గవ స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు & ఆర్ట్ కలెక్టర్. 'ఆర్నాల్ట్ లూయిస్ విట్టన్' కంపెనీ వ్యవస్థాపకుడు & ఛైర్మన్. అతని కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద రాయల్‌ గూడ్స్‌ రిటైలర్‌. ఆర్నాల్ట్ కంపెనీ ప్రపంచంలోని అతి పెద్ద లగ్జరీ బ్రాండ్లలో ఒకటి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2025 ప్రకారం ఆర్నాల్ట్ నికర విలువ (Bernard Arnault Net Worth) $184 బిలియన్లు. 


ఐదో స్థానంలో లారీ ఎల్లిసన్


ఎల్లిసన్ ఒక అమెరికన్ బిలియనీర్ & పెట్టుబడిదారుడు. అతను 'ఒరాకిల్ కార్పొరేషన్' సహ వ్యవస్థాపకుడు. లారీ ఎల్లిసన్, 1970ల ప్రారంభంలో ఆంపెక్స్ అనే కంపెనీలో పని చేశారు. 1977లో ఒరాకిల్‌ను స్థాపించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2025 ప్రకారం, లారీ ఎల్లిసన్ ప్రపంచంలో ఐదో అత్యంత ధనవంతుడు, అతని నికర విలువ (Larry Ellison Net Worth) $176 బిలియన్లు.