5G Spectrum Auction: ఏడు రోజుల సుదీర్ఘ బిడ్డింగ్ యుద్ధం తర్వాత 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. వాయు తరంగాలను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1,50,173 కోట్లు సమకూరాయి. స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, గౌతమ్ అదానీకి చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్ విపరీతంగా పోటీ పడ్డాయి. ఇతర టెలికాం కంపెనీలు సైతం 5జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నాయి.
'5జీ స్పెక్ట్రమ్ వేలం విజయవంతంగా ముగిసింది. రూ.1,50,173 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. 72,098 MHz స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి పెట్టాం. అందులో 51,236 MHz అమ్ముడైంది' అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
రిలయన్స్ జియో 24,740 MHz స్పెక్ట్రమ్ కొనుగోలు చేసి అతిపెద్ద బిడ్డర్‌గా నిలిచింది. 19,867 MHzతో భారతీ ఎయిర్‌టెల్ తర్వాతి స్థానంలో నిలిచింది. వొడాఫోన్ ఐడియా 2668 MHz స్పెక్ట్రమ్‌ను దక్కించుకోగా అదానీ డేటా నెట్‌వర్క్ 26 GHz బ్యాండులో 400 MHz 5 జీ వాయు తరంగాలను దక్కించుకున్నాయి.
రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz రేడియో తరంగాలను బిడ్డింగ్ వేశారు. స్వల్ప (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 MHz), అధిక (26 GHz) తరంగ బ్యాండ్లకు వేలం నిర్వహించారు.
ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు సర్కిల్‌లో 1800 Mhz స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డాయని తెలిసింది. ఈ సర్కిల్‌లో 10 కోట్లకు పైగా మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉండటమే ఇందుకు కారణం.
4జీతో పోలిస్తే 5జీ డేటా వేగం 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కనెక్టివిటీలో అంతరాయం ఉండదు. రియల్ టైమ్‌లో కోట్లాది డివైజులు అనుసంధానమై ఉంటాయి. సెకన్లలోనే నాణ్యమైన వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ-హెల్త్, కనెక్టెడ్ వెహికల్స్, ఇమ్మర్సివ్ రియాల్టీ, మెటావర్స్, అడ్వాన్సుడు మొబైల్ క్లౌడ్ గేమింగ్‌కు ఇదెంతో ఉపయోగపడుతుంది.