New 500 Rupees Note Goes Viral: ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం & శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ట సందర్భంగా, బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త 500 రూపాయల నోట్లను విడుదల చేయబోతోందా?. సోషల్‌ మీడియాలో ఈ విషయం ఇప్పుడు విపరీతంగా చక్కర్లు కొడుతోంది. 


రూ. 500 నోట్ల కొత్త సిరీస్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేస్తుందని సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఒక పోస్ట్‌లో ఉంది. కొత్త రూ.500 నోటు చిత్రాన్ని కూడా పోస్ట్‌ చేశారు. నోటు ముందువైపు.. ధగధగలాడే కిరీటం, ఆభరణాలు ధరించి, చేతిలో విల్లు పట్టుకుని, భుజాన అంబుల పొదితో ఉన్న శ్రీరాముడి బస్ట్‌ సైజ్‌ ఫొటో ఉంది. నోటు వెనుకవైపు... అయోధ్య రామాలయం ఫొటో ఉంది. నోటుపై తెల్లగా ఉండే ప్రాంతంలో ఎక్కుపెట్టిన విల్లు ఫొటో ఉంది. ఈ నోటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ. 500 నోటు ముందు భాగంలో జాతి పిత మహాత్మాగాంధీ బొమ్మ, వెనుక వైపు ఎర్రకోట చిత్రాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రూ. 500 నోటుపై... మహాత్ముడి బొమ్మ స్థానంలో శ్రీ రాముడి చిత్రం, ఎర్రకోట స్థానంలో అయోధ్య రామ మందిరం వచ్చి చేరాయి. 


RBI కొత్త సిరీస్ నోట్లను జారీ చేస్తోందా?
కొత్త రూ.500 నోటు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఇంకా స్పందించలేదు. శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్‌ రూ.500 నోట్లను విడుదల చేయడంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, రిజర్వ్‌ బ్యాంక్‌ వర్గాలు అనధికారికంగా చెప్పిన సమాచారం ప్రకారం, శ్రీరాముుడు, అయోధ్య రామాలయంతో వైరల్ అవుతున్న రూ. 500 నోటు నకిలీది.


బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వని రాణా చెప్పిన ప్రకారం, శ్రీరాముడి బొమ్మతో కూడిన కొత్త సిరీస్‌ రూ.500 నోట్లను రిజర్వ్‌ బ్యాంక్ తీసుకురావడం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కాబట్టి, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొత్త 500 రూపాయల నోట్లు విడుదల చేస్తారన్నది అబద్ధపు ప్రచారం. అలాంటి నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ముద్రించలేదు.


గతంలోనూ ఇలాంటి ఫేక్‌ న్యూస్‌
జాతి పిత మహాత్మాగాంధీ స్థానంలో వేరే చిత్రాలతో కొత్త రూ. 500 నోట్లను ఆర్‌బీఐ తీసుకొస్తుందని ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. ప్రస్తుత కరెన్సీ లేదా బ్యాంకు నోట్లలో మహాత్మాగాంధీ ఫొటో స్థానంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మిస్సైల్ మ్యాన్ & మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్‌ కలాం చిత్రాలను ముద్రించి, కొత్త సిరీస్ నోట్లను చెలామణీలోకి తీసుకురావాలన్న అంశాన్ని RBI పరిశీలిస్తున్నట్లు 2022 జూన్‌లోనూ సోషల్‌ మీడియా పోస్ట్‌లు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత, అవన్నీ పుకార్లేనని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ సిరీస్‌ను మార్చే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని ఆర్‌బీఐ తెలిపింది.


మరో ఆసక్తికర కథనం: బేర్‌ జోన్‌లో మార్కెట్లు - 72400 దిగువన సెన్సెక్స్‌, 21800 కింద నిఫ్టీ