Zero Income Tax Countries: ఏ దేశంలోనైనా, వ్యక్తులు సంపాదించిన ఆదాయంపై వ్యక్తిగత ఆదాయ పన్ను విధిస్తారు. ప్రత్యక్ష పన్నుల్లో (Direct Taxes) ఇది ఒకటి. ఆదాయ పన్ను చట్టం, ఆదాయ పన్ను రేట్లు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఒక పరిమితి దాటి ఆదాయం సంపాదించే ప్రతి వ్యక్తి, తన సంపాదనపై నిర్ణీత మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించాలి. 


ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు తమ ప్రజల నుంచి వ్యక్తిగత ఆదాయ పన్ను వసూలు చేస్తున్నాయి. యూనియన్‌ గవర్నమెంట్‌కు వచ్చే మొత్తం ఆదాయంలో వ్యక్తిగత ఆదాయ పన్నుది పెద్ద వాటా. అయితే, ప్రపంచంలోని అతి కొన్ని దేశాలు మాత్రం వ్యక్తిగత ఆదాయ పన్నును వసూలు చేయడం లేదు.


వ్యక్తిగత ఆదాయ పన్ను లేని 10 దేశాలు:


1. యూఏఈ (United Arab Emirates - UAE) - ఇక్కడ నివశించే ప్రజలపై ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను విధించరు.
2. సౌదీ అరేబియా (Saudi Arabia) - సౌదీ అరేబియాలో వృత్తిపరమైన పన్ను లేదు.
3. ఖతార్ ‍‌(Qatar) - జీతం, వేతనం, అలవెన్స్‌లు వంటి వాటిపై ఖతార్‌లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
4. ఒమన్ (Oman) - ఒమన్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను సున్నా.
5. కువైట్ (Kuwait) - ఈ దేశం కూడా వ్యక్తిగత ఆదాయ పన్ను విధించదు.
6. బ్రూనై (Brunei) - ప్రస్తుతం, ప్రజలపై ఎలాంటి ఆదాయపు పన్ను విధించడం లేదు. అమ్మకం పన్ను, విలువ ఆధారిత పన్ను (VAT) కూడా లేదు.
7. బెర్ముడా (Bermuda) - ఆదాయ పన్ను మాటే ఈ దేశంలో వినిపించదు. అయితే, పేరోల్ టాక్స్ యాక్ట్ 1995 ప్రకారం యజమాన్యాలపై పేరోల్ టాక్స్‌ వసూలు చేస్తుంది.
8. బహ్రెయిన్ (Bahrain) - వ్యక్తిగత ఆదాయపు పన్ను విధించని దేశాల్లో బహ్రెయిన్ కూడా ఒకటి.
9. బహామాస్ (Bahamas) - ఈ దేశ పౌరులకు ఆదాయ పన్ను, వారసత్వపు పన్ను, సంపద పన్ను అంటే ఏంటో తెలీదు. 
10. కేమాన్ ఐలాండ్స్‌ (Cayman Islands) - నల్లధనం అనగానే స్విస్‌ బ్యాంక్‌లు గుర్తుకొస్తాయి గానీ, వాటికి తాతల్లాంటి బ్యాంక్‌లు ఇక్కడ ఉన్నాయి. నల్లధనం నిల్వ చేసే బ్యాంకులున్న దేశాల్లో ప్రపంచంలో ప్రథమ స్థానం కేమాన్‌ ఐలాండ్స్‌దే. ఈ దేశంలో నివశించే ప్రజలపై ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, మూలధన లాభాల పన్ను (CGT) వంటివి విధించరు.


మన దేశంలో ఆదాయ పన్ను పరిమితి
మన దేశంలో, కొత్త పన్ను విధానంలో ‍‌‍‌(New Tax Regime), 'ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి' (Income Tax Rebate) రూ.7 లక్షలుగా ఉంది. ఈ పరిమితికి దాటి సంపాదించే వ్యక్తులు స్లాబ్‌ సిస్టం ప్రకారం టాక్స్‌ కట్టాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ రిబేట్‌ను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచిన భారత ప్రభుత్వం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి కూడా అదే పరిమితిని కొనసాగించింది. పన్ను తగ్గింపు/మినహాయింపు సెక్షన్లు కొత్త పన్ను పద్దతికి వర్తించవు. 


పాత పన్ను విధానంలో (Old Tax Regime) టాక్స్‌ రిబేట్‌ పరిమితి రూ.5 లక్షలుగా ఉంది. ఈ పద్ధతిలో, వివిధ సెక్షన్ల కింద టాక్స్‌ డిడక్షన్స్‌, ఎగ్జంప్షన్స్‌ అందుబాటులో ఉంటాయి.


మరో ఆసక్తికర కథనం: PPO నంబర్‌ పోయినా కనిపెట్టడం చాలా సులభం, పెన్షనర్లకు టెన్షన్ ఉండదిక!