రోజూ బ్రష్ చేసుకోకపోతే నోరు కంపు కొడుతుందనే సంగతి తెలిసిందే. అంతేకాదు.. మరో ముప్పు కూడా పొంచి ఉంది. మీ నోటిలో ఏర్పడే బ్యాక్టీరియా.. ప్రమాదవశాత్తు ఊపిరి తీత్తుల్లోకి చేరి ప్రమాదకర ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు. ఆ సమస్యతో నరకయాతన అనుభవిస్తారట. ఇటీవల హాస్పిటల్‌లో ఉన్న రోగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు బయటపడ్డాయి.


వివిధ అనారోగ్య కారణాలు, సర్జరీలతో హాస్పిటల్‌లో చేరి.. చికిత్స తీసుకుంటున్న వారికి హాస్పిటల్ అక్వైర్డ్ న్యుమోనియో వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. నోటిలోని బ్యాక్టీరియా ప్రమాదవశాత్తు శ్వాసనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల న్యుమోనియా రావచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారిలో హాస్పిటల్ అక్వైర్డ్ న్యుమోనియా ప్రమాదకరంగా పరిగణించవచ్చు కూడా.


హాస్పిటల్-అక్వైర్డ్ న్యుమోనియా అనేది ఆసుపత్రిలో చేరిన సమయంలో సోకే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. చాలా తీవ్రమైన అనారోగ్యం వల్ల వెంటిలేటర్ చికిత్సలో ఎక్కువ కాలం హాస్పిటల్ లో ఉండాల్సిన పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఈ రకమైన న్యుమోనియా సోకుతుంది. దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.


కారణాలు ఇవే:


న్యుమోనియా ఒక సాధారణ ఇన్ఫెక్షన్. హాస్పిటల్ అక్వైర్డ్ న్యుమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లలో చాలా తీవ్రమైంది.



  • హాస్పిటల్ లో చేరిన వ్యక్తులు సాధారణంగా చాలా అనారోగ్యంతో ఉంటారు. వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడలేరు.

  • ఆసుపత్రిలో ఉండే సూక్ష్మజీవులు మాములుగా హాస్పిటల్ బయట.. వాతావరణంలో ఉండే వాటి కంటే చాలా ప్రమాదకరమైనవి. ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి. అందువల్ల హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్లు చాలా ప్రమాదకరమైనవి.


నివారణే మేలు


ఇలాంటి ఇన్ఫెక్షన్లకు చికిత్స కంటే నివారణే మంచిది. కనుక హాస్పిటల్ లో ఎక్కువ కాలం పాటు వెంటిలెటర్ మీద లేదా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న రోగుల విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది.



  • మాములుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం

  • రోగి దగ్గరకు ఎక్కువ మంది వెళ్లకుండా జాగ్రత్త పడడం

  • రోగితో ఉండేవారు తరచుగా చేతులు కడుక్కోవడం

  • వీలైనంత ఎక్కువగా శానీటైజర్లు, మాస్కులు ఉపయోగించడం


ఇవన్నీ కూడా సాధారణంగా పాటించే జాగ్రత్తలు. వీటికి మరోజాగ్రత్తను తప్పకుండా చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేమిటంటే హాస్పిటల్‌లో ఉన్న రోజుల్లో తప్పని సరిగా ప్రతి రోజూ బ్రష్ చేసుకోవడం అనే ఒక చిన్న జాగ్రత్తతో ప్రాణాంతక న్యుమోనియా బారిన పడకుండా నివారించవచ్చట.


ఈ విషయాన్ని దృవీకరించేందుకు అధ్యయనకారులు ప్రపంచవ్యాప్తంగా 2,786 మంది రోగులల్లో 15 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించారు. రోజూ హాస్పిటల్ లో ఉన్న రోగులకు ప్రతి బ్రష్ చేయ్యడంతో హాస్పిటల్ అక్వైర్డ్ న్యుమోనియా లేదా ఐసీయూలో జరిగే మరణాలకు సంబంధం ఉన్నట్టు నిర్ధారించారు. ముఖ్యంగా మెకానికల్ వెంటీలెటర్ మీద చికిత్స తీసుకున్న రోగుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. కనుక వీరికి ప్రతిరోజూ బ్రష్ చెయ్యడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


చాలా అరుదుగా హాస్పిటల్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఇలాంటి చవకైన, ప్రభావవంతమైన చికిత్సను నిర్ధారించడం జరుగుతుంద. కొత్త పరికరం లేదా కొత్త మందును వాడడానికి బదులుగా కేవలం పళ్లు తోముకోవడం ద్వారా ఇంత పెద్ద మార్పుకు అవకాశం ఉందని ఈ అధ్యయన ఫలితం సూచిస్తోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు తమ అభిప్రాయాన్ని తెలిపారు.


Also read : Foul body odours: ఈ శరీర భాగాల నుంచి దుర్వాసన వస్తోందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.