Joe Root finishes unbeaten on 122: రాంచీ(Ranchi)లో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్(England)లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్(Joe Root) 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓ వైపు రూట్ అడ్డుగోడలా నిల్చినా... అవతలి వైపు వికెట్లన్నీ నేలకూలాయి. ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్... మరో 51 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఓలీ రాబిన్సర్ అర్ధ శతకం సాధించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ రాబిన్సన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం సాధించాడు. మరోవైపు రూట్ బజ్‌బాల్ ఆటకు స్వస్తి పలికి ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. రూట్-రాబిన్సన్ కలిసి ఎనిమిదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ భాగస్వామ్యాన్ని జడేజా విడదీశాడు. జడేజా వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయిన రాబిన్సన్ వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. ఇంగ్లాండ్ రివ్యూకి వెళ్లినా ఫలితం లభించలేదు. ఇదే ఓవర్‌లో జడేజా మరో వికెట్ తీశాడు. నాలుగో బంతికి బషీర్‌ను ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 9వ వికెట్ కోల్పోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ 122*, రాబిన్సన్ 58, బెన్ ఫోక్స్ 47, జాక్ క్రాలే 42, బెయిర్‌స్టో 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీయగా అశ్విన్‌కు ఒక వికెట్ దక్కింది.
ఆరంగేట్రంలోనే ఇరగదీసిన ఆకాశ్
రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అరంగేట్ర బౌలర్ ఆకాశ్‌దీప్(Akash Deep) తొలి రోజు మ్యాచ్‌లో అదరగొట్టాడు. అద్భుతమైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మంచి లైన్ అండ్ లెంత్‌తో.. షార్ట్ పిచ్ బంతులతో... బ్రిటీష్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తొలుత క్రాలేను అద్భుతమైన బంతితో ఆకాశ్‌దీప్ బౌల్డ్ చేసినా అది నో బాల్ కావడంతో క్రాలే బతికిపోయాడు. ఆ బంతి నో బాల్ అయినా... మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. అనంతరం కూడా మంచి టచ్‌లో కనిపించిన ఆకాశ్ పేస్‌తో ఇంగ్లాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. అనంతరం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఆకాశ్ దీప్... ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్ తీసి బ్రిటీష్ జట్టను కోలుకోలేని దెబ్బ తీశాడు. పదో ఓవర్లో డకెట్‌ను అవుట్ చేసిన ఆకాశ్... ఒక బంతి విరామం తర్వాత ఒలిపోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బ్రిటీష్ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే క్రాలేను బౌల్డ్ చేసిన ఆకాశ్ ఇంగ్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు.
అశ్విన్ అరుదైన రికార్డులు
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. తొలి సెషన్‌లోనే అయిదు వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టారు. అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఆ తర్వాత అశ్విన్, జడేజా చెరో వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్‌కు ముందు ఓవర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జడేజా ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో 112 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్ పడింది. మాజీ కెప్టెన్ జో రూట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్.. అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్ స్టోను అవుట్ చేసి అశ్విన్ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్ స్పిన్నర్ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్ అండర్సన్ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు