Independence Day 2022:
RRR సినిమాతో తెరపైకి కొత్త చర్చ..
మనకు స్వాతంత్య్రం ఎలా వచ్చింది..? స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించింది ఎవరు..? బహుశా ఇవి ఇప్పుడుచర్చించుకోవాల్సిన అంశాలు కావేమో అనిపిస్తుండొచ్చు. కానీ...అసలైన చర్చ ఇప్పుడే జరుగుతోంది. అందుకు కారణం..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటుంది దేశమంతా. అయితే...ఆ యోధుల లిస్ట్‌లో అన్నింటి కన్నా పైన కనిపించే పేరు మహాత్మా గాంధీజీ. ప్రతి భారతీయుడూ ఆయనను జాతిపితగా పిలుచుకుంటారు. ఆ తరవాత మిగతా వాళ్ల పేర్లు కనిపిస్తాయి. ఎందుకిలా..అంటే భిన్న వాదనలు వినిపిస్తాయి. ఇప్పుడు ఈ డిస్కషన్‌కి కాస్త సినిమాటిక్ టచ్ ఇద్దాం. రీసెంట్‌గా రిలీజై రికార్డులు బద్దలు కొట్టిన RRR మూవీ గురించి మాట్లాడుకుందాం. అల్లూరి సీతారామరాజు, కొమురం భీముడు మధ్య స్నేహాన్ని, వైరాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా దేశభక్తి మూవీల ట్రెండ్‌ను కొత్త మలుపు తిప్పింది. హాలీవుడ్ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రంలో ఓ చిత్ర విచిత్రం జరిగింది. సినిమా చివర్లో స్వాతంత్య్ర సమరయోధుల వీరత్వాన్ని స్మరించుకుంటూ ఓ పాట వస్తుంది. అందులో ఎక్కడా గాంధీ పేరు కానీ, జవహర్ లాల్ నెహ్రూ పేరు కానీ వినిపించలేదు. వాళ్ల ఫోటోలూ కనిపించలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ పటేల్ పేర్లు మాత్రం వినిపించాయి. అదిగో అప్పుడు మొదలైందీ చర్చ. స్వాతంత్య్రం అంటేనే మహాత్మా గాంధీ అని విశ్వసిస్తున్న వారికి ఇది మింగుడు పడలేదు. ఆ సినిమా హిట్ అయింది. కోట్లకు కోట్లు కొల్లగొట్టింది. ఇదంతా వేరే విషయం. కానీ...గాంధీ ఫోటో, పేరు లేకపోవటం పెద్ద లోటు అని కొందరు భావించారు.
గాంధీని "సుప్రీం"గా కొలిచిన ఆర్టిస్ట్‌లు..
ఇదే విషయాన్ని RRR రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ సందర్భంలో వివరించారు. "ఐదేళ్ల క్రితం...ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, వాట్సాప్‌లలో కొందరు ఫ్రెండ్స్ కొన్ని పోస్ట్‌లు పెట్టారు. అవి చూసిన తరవాత అసలు దేశానికి గాంధీజీ, నెహ్రూ ఏమైనా చేశారా..? అనే అనుమానం కలిగింది. స్వాతంత్య్ర ఉద్యమం గురించి స్కూల్‌లో చదువుకునే రోజుల్లో చెప్పిన చరిత్రను నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను" అని స్పష్టంగా చెప్పారు. అది ఆయన అభిప్రాయం కావచ్చు. దానితో మనకు ఎలాంటి సంబంధం లేదు. సరే ఇక సినిమా గురించి వదిలేసి అసలు విషయంలోకి వద్దాం. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో మంది సమరయోధులు పాల్గొంటే..."మహాత్ముడి" పేరు ఎందుకలా నిలబడిపోయింది. ఇది తెలియాలంటే ఆదిత్య 369 సినిమాలో లాగా మనమూ ఆ కాలానికి వెళ్లాల్సిన పని లేదు. చరిత్ర పుటలు తెరిచి...ఓసారి అప్పటి సంఘటల్ని గమనిస్తే చాలు. ఆ పుటలు తిరగేసినప్పుడే కొన్ని పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ చిత్రాలే మనకు కథనంతా చెప్పేస్తాయి.
ప్రతి పెయింటింగ్‌లోనూ గాంధీకి అత్యున్నత స్థానం..
అప్పటి ఆర్టిస్ట్‌లు, ప్రింట్ మేకర్లు... మహాత్మా గాంధీజీని "సుప్రీం"గా భావించారు. వాళ్లు గీసిన ప్రతి పెయింటింగ్‌లోనూ గాంధీకి అత్యున్నత స్థానం ఇచ్చారు. అప్పట్లో ఆయన పిలుపునిచ్చిన ప్రతి ఉద్యమాలను కవర్ చేసేందుకు పత్రికలు పుట్టుకొచ్చాయి. అందులో ప్రతి కథనం గాంధీజీ గురించే. చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, నో ట్యాక్స్ క్యాంపెయిన్స్, బర్దోలి సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం..ఇలా ప్రతి మూవ్‌మెంట్‌లోనూ గాంధీజీ నిబద్ధతను పొగుడుతూ ఆయన ఫోటోలతో నింపేశాయి. ఇక ఆర్టిస్ట్‌లు కూడా గాంధీకి ఉన్నత స్థానమే ఇచ్చారు. అప్పటి రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన వ్యక్తిగా, అన్ని మతాలకూమూలపురుషుడిగా...చిత్రీకరించారు. 1947-48 మధ్య కాలంలో పీఎస్ రామచంద్ర రావు గీసిన ఓ పెయింటింగ్‌లో గాంధీని చిత్రించిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. "The Splendour That is India" అనే పేరుతో గీసిన ఈ పెయింటింగ్‌లో భరతమాత మధ్యలో నిలబడి ఉండగా..చుట్టూ వాల్మీకి, తిరువల్లువర్, బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్య, రామానుజా చార్యులు, గురునానక్, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస చిత్రాలున్నాయి. వీరితో పాటు మహాత్మ గాంధీజీ చిత్రాన్నీ గీశారు. భారతదేశ ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలిచే వారి మధ్య గాంధీ బొమ్మ వేయటం ద్వారా తన అభిప్రాయమేంటో చెప్పకనే చెప్పారు...పీఎస్ రామచంద్ర రావు. (ఈ కింది ఫోటో చూడండి)
గాంధీని ఆరాధించిన ప్రభు దయాళ్..
ఇదొక్కటే కాదు. ఇలా గాంధీని "సుప్రీం"గా చూపించిన పెయింటింగ్‌లు ఎన్నో ఉన్నాయి. కాన్పూర్‌లో శ్యామ్ సుందర్ లాల్ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ప్రభు దయాళ్ గీసిన ఓ పెయింటింగ్‌లో గాంధీజీని చూపించిన తీరు విస్మయం కలిగించక మానదు. "సత్యాగ్రహ యోగ సాధన" పేరుతో ఈ పెయింటింగ్ వేశారు ప్రభు దయాళ్. యోగాతోనే సత్యాగ్రహం సాధ్యమవుతుందనే అర్థం వచ్చేలా ఈ పెయింటింగ్ వేశారు. గాంధీ మధ్యలో ఉండగా, ఎడమ వైపు మోతీలాల్ నెహ్రూ, కుడి వైపు జవహర్ లాల్ నెహ్రూ ఉన్నారు. మహాత్మా గాంధీజీ ముళ్ల పాన్పుపై కూర్చున్నట్టుగా గీశారు. అంపశయ్యపై పడుకుని భీష్ముడు ధర్మ ప్రబోధం చేసిన దృశ్యాన్ని గుర్తు చేసింది ఈ పెయింటింగ్. ముళ్లు లేకుండా రోజాలు ఉండవు. అదే విధంగా...క్రమశిక్షణ లేకుండా స్వాతంత్య్రం సాధించలేం అనే సందేశాన్నిచ్చింది. ఈ ముగ్గురి పైనా ఓ చోట నుంచి కిరణాలు పడుతున్నట్టుగా చూపించారు. అవి "పూర్ణ స్వరాజ్" (Poori Azaadi)వెలుగులు. 1929లో జవహర్‌లాల్ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఈ "పూరీ ఆజాదీ" తీర్మానం ఆమోదించారు.
రాముడిగా మహాత్మా గాంధీజీ..
ఇక మరో పెయింటింగ్‌లో గాంధీజీని రాముడిగా చిత్రించారు. రాముడు, రావణుడి మధ్య జరిగిన యుద్ధాన్ని...స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. హింసకు, అహింసకు మధ్య, సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని గాంధీజీని, బ్రిటీష్ వాళ్లను చిత్రించారు. గాంధీజీ చేతిలో రాట్నం ఉండగా..బ్రిటీష్ వాళ్ల చేతిలో ఆయుధాలున్నాయి. ఆ బ్రిటీష్ రాజ్‌ని పది తలల రావణుడిగా చూపించారు. రావణుడితో యుద్ధం చేసిన సమయంలో రాముడికి హనుమంతుడు ఎలాగైతే అండగా నిలిచాడో...గాంధీజీకి నెహ్రూ అలా తోడుగా ఉన్నాడన్నట్టుగా ఈ పెయింటింగ్‌లో చూపించారు. ఇది కూడా ప్రభు దయాళ్ గీసిందే.
ఇవే కాదు. ఆయన ప్రతి పెయింటింగ్‌లోనూ మహాత్ముడిని ఇలాగే చూపించారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్‌లకు గాంధీతో సిద్ధాంత విభేదాలుండేవని చరిత్ర చెబుతోంది. కానీ...ప్రభు దయాళ్ మాత్రం తన పెయింటింగ్స్‌లో ఎక్కడా ఆ అంశాన్ని చూపించలేదు. ఆయన గీసిన "The Sacrifice of Heroes at the Altar of Independence" పెయింటింగ్ ఇందుకు ఉదాహరణ. ఈ చిత్రంలో గాంధీజీతో పాటు భగత్ సింగ్, మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ కూడా చూడొచ్చు. భగత్ సింగ్‌కి ప్రభు దయాళ్...ఎంతో గౌరవమిచ్చారనటానికి ఇదే ఉదాహరణ. అంతే కాదు. ఆయన ప్రాణత్యాగానికీ విలువనిచ్చారు. అయితే...ఈ పెయింటింగ్‌లపై ఎన్నో వాదనలు వినిపించాయి. వివాదాస్పదమూ అయ్యాయి. కొందరు చరిత్రకారులు...వీటిని ఖండించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన అసలు నిజాల్ని ఇవి ప్రతిబింబించకపోగా..చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నాయని వాదిస్తున్న వారూ ఉన్నారు.
గమనిక: లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హిస్టరీ ప్రొఫెసర్ వినయ్ లాల్ ఈ ఆర్టికల్ రాయగా..మేము (ABP Desam) అనువదించాం. ఆయన రాసిన "Insurgency And the Artist" బుక్‌లో "ఆర్ట్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్" గురించి రాశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ పుస్తకం విడుదల కానుంది. ఈ ఆర్టికల్‌లోని అంశాలు..మా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. కేవలం ఆయన ఆర్టికల్ నుంచి ఇన్‌పుట్స్ తీసుకుని రాశామని గమనించగలరు.