ఎన్నో అవమానాలు భరించారు..
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఎన్నో అంశాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ...పంచప్రాణాలు పెట్టి దేశ వృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఓ కీలక విషయాన్ని చర్చించారు. భారత దేశ వృద్ధికి మహిళలను గౌరవించటం ఎంతో అవసరమని వివరించారు. "మన నారీశక్తికి అండగా ఉండటం మన బాధ్యత" అని చెప్పారు. "మహిళలను కించపరచటం మానేయండి" అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు ప్రధాని. భారత్‌లో మహిళలు ఇప్పటికే ఎన్నో అవమానాలు భరించారని, భారతీయులంతా కలిసి ఈ ఆలోచనను నిర్మూలించాలని సూచించారు. "మాటలు కానీ, మన ప్రవర్తన కానీ వారిని అవమానపరిచే విధంగా ఉండకూడదు. వాళ్లు తక్కువ అనే భావన కలగకుండా మనం నడుచుకోవాలి" అని వ్యాఖ్యానించారు. భారత్‌లో ప్రజల ఐకమత్యం "భిన్నత్వం"లోనే ఉందని అన్నారు. "ఈ ఐక్యతను కోల్పోకుండా ఉండాలంటే తప్పకుండా లింగసమానత్వం సాధించాలి. కూతుళ్లను, కొడుకులను ఒకే విధంగా చూడకపోతే...యూనిటీ ఎప్పటికీ సాధించలేం" అని స్పష్టం చేశారు.
స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడారు..
స్వాతంత్య్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన మహిళలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. "భారత్‌లోని నారీశక్తిని తలుచుకుంటే ప్రతి ఒక్కరి గుండె ఉప్పొంగుతుంది. రాణీ లక్ష్మీబాయ్, జల్కారీ బాయ్, చెన్నమ్మ, బెగున్ హజ్రత్ మహల్..ఇలా మహిళలు స్వాతంత్య్రం కోసం పోరాడారు" అని చెప్పారు. నిజానికి ప్రధాని చేసిన వ్యాఖ్యలు...పరోక్షంగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్‌ను ఉద్దేశించేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ అధిర్ రంజన్ "రాష్ట్రపత్ని" అని పలికారు. దీనిపై పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది భాజపా. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టు పట్టింది. రాష్ట్రపతిని అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు నాలుగు రోజుల పాటు భాజపా, కాంగ్రెస్ మధ్య ఈ అంశంపైనా వాగ్వాదం జరిగింది. చివరకు అధిర్ రంజన్ క్షమాపణ చెప్పారు. పొరపాటున నోరు జారారని వివరణ ఇచ్చారు. అక్కడితో ఆ వివాదం ముగిసిపోయింది. ఆ సమయంలో ప్రధాని మోదీ స్పందించలేదు. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
వాళ్లకు తలవంచటం మన బాధ్యత..
‘‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది. 75 ఏళ్ల ప్రయాణంలో భారత్‌కు అమూల్యమైన సామర్థ్యం ఉందని, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని భారత్ నిరూపించుకుంది. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారైనా, దేశాన్ని నిర్మించిన వారైన - డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ జీ, సర్దార్ పటేల్, ఎస్పీ ముఖర్జీ, ఎల్బీ శాస్త్రి, దీనదయాళ్ ఉపాధ్యాయ, జేపీ నారాయణ్, ఆర్‌ఎం లోహియా, వినోబా భావే, నానాజీ దేశ్‌ముఖ్, సుబ్రమణ్య భారతి - అటువంటి గొప్ప వ్యక్తుల ముందు తలవంచండి’’ అని ప్రధాని అన్నారు. మన దేశానికి వచ్చే 25 ఏళ్లు అమృత కాలమని, అది చాలా ముఖ్యమని మోదీ చెప్పారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 7.30 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు.
Also Read: PM Modi Speech Highlights: ఈ మార్గం చాలా కఠినం, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం - గెలిచి చూపించాం: మోదీ