Poker Players: నిర్మల్ జిల్లాలో ఈ మధ్య తరచుగా కొందరు పేకాట ఆడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద, ఇళ్లల్లో బెట్టింగ్స్ కాస్తూ, తమకు నచ్చినంత సేపు ఆటను కొనసాగిస్తున్నారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న వారిపై పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని, మరియు వాహనాలు సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 13 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాధన్ కుర్తి గ్రామంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక మోటర్ సైకిల్, 3 కార్లు, 11 సెల్ ఫోన్లు, రూ.5,11,540 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న 13 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.
గోదావరి పరివాహక ప్రాంతమైన బాధన్ కుర్తి అడ్డాగా..
ఖానాపూర్ సీఐ అజయ్ బాబు మాట్లాడుతూ.. పక్క జిల్లా నుంచి కొందరు వచ్చి గోదావరి పరివాహక ప్రాంతమైన బాధన్ కుర్తి గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లు తెలిసిందన్నారు. ఇందులో స్థానిక వ్యక్తుల హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా కలిసి ఓ ఇంట్లో పేకాట అడుతున్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు నిర్వహించామని... ఈ క్రమంలో 13 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద ఫోన్ లు, కార్లు, బైకులతో సహా డబ్బును కూడా స్వాధీనం చేస్కున్నట్లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలనే పేకాట స్థావరాలకు అడ్డాలుగా మార్చుకున్నారు. స్థానిక ప్రజలతో కలిసి ఏర్పాటు చేసుకొని పందేలు నిర్వహిస్తుంటారు. వీరి కనుసున్నల్లో రోజూ లక్షల్లో పందేలు సాగిస్తుంటారు.
గతంలో పేకాటకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్..
రెండు, మూడు నెలల కిందటి వరకు కొందరు నేతలు, వ్యాపారులు నిర్వాహకులుగా మారి హైదరాబాద్ నగరాన్ని జూదానికి అడ్డాగా మార్చేశారని విమర్శలు వచ్చాయి. అందుకు సంబంధించి కొన్ని కేసులు సైతం నమోదయ్యాయి. హైదరాబాద్ లోని పలు కాలనీల్లో, అపార్ల్ మెంట్లలో, విల్లాలను అద్దెకు తీసుకొని దర్జాగా జూద గృహాలను నడుపుతున్నారు. పండుగలు, వారాంతం, సెలవు రోజుల్లో మూడు ముక్కలాటలు ఆడుతుండేవారు. కావూరి హిల్స్ లోని ఓ అపార్ట్ మెంట్లో పేకాట స్థావరంపై డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. 90 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేస్కొని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అలాగే గతేడాది నార్సింగి వద్ద ఫామ్ హౌస్ లో క్యాసినో, పేకాట నిర్వాహకుడు గుత్తా సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఖరీదైన హోటళ్లు, రిసార్టుల్లో విందు, వినోదాలతో ప్రముఖులను ఆకట్టుకుంటున్నారు. వారి పేర్లను ఉపయోగించుకొని రోజూ పేకాట నిర్వహించే వాడని పోలీసుల విచారణలో తేలింది. పంజాగుట్ట, గచ్చిబౌలి, ఠాణాల్లో అతనిపై పాత కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చినా తీరు మారకపోవడంతో గతేడాది డిసెంబర్ లో ఇతడిపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పీడా యాక్ట్ కేసు కూడా ప్రయోగించారు.