Xiaomi Electric Car: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సమాచారం ప్రకారం షావోమీ త్వరలో భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతోంది. ఈ కారు పేరు షావోమీ ఎస్‌యూ7. అదే సమయంలో ఈ కారు 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉండనుంది.


షావోమీ కొత్త ఎలక్ట్రిక్ కారు
షావోమీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును నాలుగు విభిన్న వేరియంట్లలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది ఎంట్రీ లెవల్ మోడల్, లిమిటెడ్ ఫౌండర్స్ మోడల్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు డిజైన్ చాలా ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. షావోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు పొడవు 4997 మిల్లీమీటర్లు కాగా, ఎత్తు 1455 మిల్లీమీటర్లుగానూ, వెడల్పు 1963 మిల్లీమీటర్లుగానూ ఉంటుంది.



Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూప‌ర్ - భార‌త్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?


భారీ బ్యాటరీ ప్యాక్
షావోమీ కొత్త ఎలక్ట్రిక్ కారును రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఎంట్రీ లెవల్ వేరియంట్ 73.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో దాని టాప్ మోడల్ 101 కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఎంట్రీ లెవల్ వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేస్తే 700 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.


మరోవైపు టాప్ మోడల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 810 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ కారు గరిష్టంగా గంటకు 265 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 2.78 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.


ఎంత ఖర్చు అవుతుంది?
షావోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతదేశంలో త్వరలో లాంచ్ కానుంది. అదే సమయంలో కంపెనీ భారతదేశంలో దాని ధరలను ఇంకా ప్రకటించలేదు. కానీ చైనాలో విడుదల చేసిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.24.90 లక్షలుగా ఉంది. కంపెనీ ఈ కారును భారతదేశంలో దాదాపు రూ. 25 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. కారు లాంచ్ అయితే కానీ దీనిపై ఏమీ కచ్చితంగా చెప్పలేం. షావోమీ లాంచ్ చేయనున్న ఈ కారుపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. లుక్, ఫీచర్ల పరంగా ఆ అంచనాలను అందుకునేలానే షావోమీ ఎస్‌యూ7 కనిపిస్తుంది. కానీ లాంచ్ అయ్యాక ఆన్ రోడ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి!






Also Read: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!