Keshava Rao As Telangana Government Advisor: ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత కె.కేశవరావుకు (K.Keshava Rao) తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (Telangana Government Advisor) నియమించింది. కేకేకు ఉన్న అపార రాజకీయ, పాలనాపరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ సర్కారు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
కాగా, ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన కేశవరావు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత రోజే రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2020లో బీఆర్ఎస్ నుంచి కేకే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇంకా రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉండగానే కాంగ్రెస్ కండువా కప్పుకొన్న అనంతరం ఆ పదవిని వదిలేశారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికల ద్వారా ఆయన మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కుమారుడు విప్లవ్ ఇంకా బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నారు.
కేకే మొదటి నుంచీ కాంగ్రెస్ నేత కాగా.. పలుమార్లు పీసీసీ చీఫ్‌గానూ పనిచేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లోనూ ఒక్కసారే విజయం సాధించారు. తర్వాత ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. వివిధ పదవుల్లో మాత్రం కొనసాగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత.. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందగా.. హస్తం పార్టీలోకి క్రమంగా వలసలు పెరిగాయి. ఈ క్రమంలోనే కేకే సైతం తన సొంతగూటికి చేరిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు హస్తం పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తూ కీలక బాధ్యతలు అప్పగించారు.
'కాంగ్రెస్ నా సొంతిల్లు'
కాంగ్రెస్ తన సొంతిల్లని.. తాను ఎప్పుడూ కాంగ్రెస్ మనిషేనని కే.కేశవరావు పార్టీ చేరిక సందర్భంగా చెప్పారు. ఇప్పుడు తనకు స్వేచ్ఛ ఫీలింగ్ ఉందని.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. తిరిగి హస్తం పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోందని ప్రశంసించారు. తాను నైతిక విలువలతోనే రాజీనామా చేశానని.. రాజ్యసభ ఛైర్మన్‌కు కూడా అదే చెప్పానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
మరోవైపు, కాంగ్రెస్‌లోకి వలసలు ఆగడం లేదు. ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ను కలిసిన ఎమ్మెల్యేను హస్తంలోకి సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాగా, ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంలో చేరిపోయారు. శుక్రవారం ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.