New Compact SUVs Arriving: ప్రస్తుతం ఎస్‌యూవీ సెగ్మెంట్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. వాహన తయారీ కంపెనీలు కూడా ఎస్‌యూవీల రేసులో పడ్డాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం కాబట్టి ఇందులో తమను తాము నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. సబ్ 4 మీటర్ SUVలు కూడా మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారిలో ఆదరణ పొందుతున్నాయి. సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కానీ వచ్చే సంవత్సరంలో మరో మూడు మోడల్స్ భారత మార్కెట్‌లో విడుదల కానున్నాయి.


స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ (Skoda Compact SUV)
2025 మొదటి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి మధ్యలో) దేశంలో కొత్త సబ్ 4 మీటర్ల ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్లు స్కోడా ధృవీకరించింది. ఇది ఎంక్యూటీ ఏవో ఐఎన్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన అప్‌డేటెడ్ వెర్షన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందే అవకాశం ఉంది. ఇది 110 బీహెచ్‌పీ, 200 ఎన్ఎం అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి.


మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)
మహీంద్రా రాబోయే వారాల్లో ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. కొత్త మోడల్ భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. అప్‌డేట్ చేసిన ఎక్స్‌యూవీ300 ప్రత్యేక డిజైన్ అప్‌డేట్‌లను, కొత్త ఫీచర్ లోడెడ్ ఇంటీరియర్‌ను పొందుతుంది. ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ ఎక్స్‌యూవీ400 ఈవీని పోలి ఉండవచ్చు. ఇది రెండు 10.25 అంగుళాల స్క్రీన్‌లతో అప్‌డేట్ చేసిన డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో పాటు 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక ఎయిర్ కాన్ వెంట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఎస్‌యూవీలోని ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఇంజన్ ఆప్షన్లు ఎస్‌యూవీలో అలాగే ఉంటాయి.


కియా క్లావిస్ (Kia Clavis)
కియా 2024 చివరిలో కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేయనుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కారు పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. దీని పేరు కియా క్లావిస్. ఈ లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ టెక్నాలజీ, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక అధునాతన ఫీచర్లతో రానుంది. కియా క్లావిస్ కాంపాక్ట్ SUV పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో అందించబడుతుంది.


మరోవైపు ఫోక్స్‌వాగన్ తన కొత్త మోడల్ ఐడీ.3 జీటీఎక్స్‌ని పరిచయం చేసింది. ఈ కారు రెండు విభిన్న అవుట్‌పుట్ రేంజ్‌ల్లో గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. ఫోక్స్‌వాగన్ లాంచ్ చేసిన శక్తివంతమైన ఎలక్ట్రిక్ డ్రైవ్ మోటార్లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం భారత్‌లో ఈ కారును విడుదల చేస్తుందా లేదా అన్నది తెలియరాలేదు. కంపెనీ రాబోయే కాలంలో భారతీయ మార్కెట్‌లో ఐడీ.4ని తీసుకురావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!