Trending
Viksit Bharat Messages: మోదీ సర్కార్‌కి ఈసీ ఝలక్, వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపేయాలని ఆదేశం
Viksit Bharat Messages: వికసిత్ భారత్ మెసేజ్‌లను వెంటనే ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఈసీ తేల్చి చెప్పింది.
Viksit Bharat Whatsapp Messages: కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌లో పంపుతున్న Viksit Bharat మెసేజ్‌లపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. వెంటనే ఆ సందేశాలు పంపడాన్ని ఆపేయాలని తేల్చి చెప్పింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. అంతే కాదు. దీనిపై పూర్తి స్థాయిలో ఓ రిపోర్ట్ తయారు చేసి సబ్మిట్ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కొన్ని నిబంధనల్ని పాటించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల గురించి ఈ మెసేజ్‌లలో ప్రస్తావించడాన్ని తప్పుబట్టింది.
Viksit Bharat Sampark పేరుతో మోదీ ప్రభుత్వం అందరి వాట్సాప్‌లకు మెసేజ్‌లు పంపుతోంది. అందులో ఓ PDF ఫైల్ కూడా ఉంటోంది. ఇప్పటి వరకూ కేంద్రం చేసిన అభివృద్ధిని ప్రస్తావించడంతో పాటు ఫీడ్‌బ్యాక్, సలహాలు సూచనలు ఏమైనా ఉంటే అందులో నింపాలని కోరుతూ మెసేజ్‌లు పంపుతోంది. వీటిని వెంటనే ఆపేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే...ఈ ఆదేశాలపై ఐటీ శాఖ స్పందించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రాకముందే ఈ మెసేజ్‌లు పంపామని వివరించింది. నెట్‌వర్క్ లిమిటేషన్స్ కారణంగా కొందరి ఆలస్యంగా డెలివరీ అవుతున్నాయని చెప్పింది. మార్చి 16వ తేదీన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని...అయితే అంతకు ముందు రోజు అంటే మార్చి 15వ తేదీనే ఈ మెసేజ్‌లు పంపినట్టు వివరణ ఇచ్చింది ఐటీ శాఖ.
ఇప్పటికే ఈ మెసేజ్‌లపై రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటివి ఎలా పంపుతారంటూ ప్రతిపక్షాలు వాదించాయి. కేరళ కాంగ్రెస్ దీనిపై వరుస పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టింది. ప్రభుత్వం అధీనంలో ఉన్న డేటాబేస్‌ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, మెసేజింగ్ యాప్‌ని రాజకీయ ప్రచారాల కోసం వాడుకుంటోందని మండి పడింది. ఈ పోస్ట్‌లకు మెటా అకౌంట్‌ని ట్యాగ్ చేసి ప్రశ్నలు సంధిస్తోంది. Viksit Bharat Sampark పేరిట ఉన్న వాట్సాప్ వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఆటోమేటెడ్ మెసేజ్‌లు రావడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరుతున్న పార్టీ అందులో PDFని పంపడంపై మండి పడింది. ఇదంతా కేవలం ప్రచారమే అని విమర్శిస్తోంది. ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేసింది. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఇలాంటి ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఈ మెసేజ్‌లపై ఫోకస్ పెట్టింది. ఎన్నికల కోడ్‌ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆపేయాలని స్పష్టం చేసింది.