Jio AirFiber Plus: జియో తన ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం ధన్ ధనా ధన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇది జియో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్. దీని ద్వారా దాని వినియోగదారులకు మూడు రెట్లు వేగంతో ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. ఈ ధన్ ధనా ధన్ ఆఫర్ కింద ఎయిర్‌ఫైబర్ ప్లస్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులకు జియో మూడు రెట్లు ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. ఏకంగా 60 రోజుల పాటు ప్రస్తుత వేగం కంటే మూడు రెట్లు వేగంగా ఇంటర్నెట్ పని చేస్తుందన్న మాట.
ఐపీఎల్ కోసం స్పెషల్ ఆఫర్
జియో అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ఐపీఎల్ 2024 (ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ రేపటి (మార్చి 22వ తేదీ) నుంచి ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ 2024 సీజన్‌ను జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. దీని కారణంగా జియో ఇప్పుడు ఐపీఎల్‌ని Jio సినిమాలో చూడటానికి ఇంటర్నెట్ వేగాన్ని మూడు రెట్లు పెంచింది. జియో అందిస్తున్న ఈ ఆఫర్‌ను ఎయిర్‌ఫైబర్ ప్లస్ ప్రస్తుత, కొత్త వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చు. జియో ఈ ప్లాన్‌కి స్పీడ్ బూస్టర్ అనే పేరు పెట్టింది. దీని వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది.
ఏ ప్లాన్‌కి ఎంత స్పీడ్ పెరగనుంది?
- మీరు 30 ఎంబీపీఎస్ స్పీడ్ ఉన్న ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే, 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సర్వీసును పొందుతారు.
- ఒకవేళ 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే, 300 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందుతారు.
- 300 ఎంబీపీఎస్ ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే, 500 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సర్వీసులను పొందుతారు.
- 500 ఎంబీపీఎస్ స్పీడ్ అందించే ఎయిర్‌ఫైబర్ ప్లస్ ప్లాన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది.
జియోఫైబర్ వినియోగదారులు తమ ప్లాన్‌ని రీఛార్జ్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా బూస్టర్ స్పీడ్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. ఇప్పటికే ఈ ప్లాన్లు ఉపయోగిస్తున్న వినియోగదారులు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా జియో నుంచి కన్ఫర్మేషన్ పొందుతారు. దీనిలో బూస్టర్ స్పీడ్ అప్‌గ్రేడ్ గురించి వారికి తెలుస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ అందిస్తున్న ఆరు నెలలు, 12 నెలల సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.
మరోవైపు జియో త్వరలో పేమెంట్స్ రంగంలోకి కూడా బరిలోకి దిగనుంది. దీంతో ఫోన్‌పే, పేటీయంలకు మరో గట్టి ప్రత్యర్థి ఎదురవుతుందని అనుకోవచ్చు. ముఖ్యంగా పేమెంట్ సౌండ్ బాక్స్ విభాగంలో పేటీయం ముందంజలో ఉంది. కానీ ఆ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను జియో తనకు అవకాశంగా మార్చుకుంటోంది. డిజిటల్ చెల్లింపుల విభాగంలోకి స్మార్ట్ స్పీకర్‌తో రానున్నట్లు గూగుల్ పేమెంట్స్ సర్వీస్ గూగుల్‌పే ఇప్పటికే ప్రకటించింది. భారత్‌పే కూడా ఈ విభాగంలోకి రావడానికి పని చేస్తోంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?