New Cars in May 2023: మారుతి సుజుకి ఫ్రాంక్స్, ఎంజీ కామెట్ ఈవీ, 2023 లెక్సస్ ఆర్ఎక్స్ వంటి కార్లు ఏప్రిల్ 2023లో మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ నెలలో కూడా చాలా కొత్త కార్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇందులో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బీఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయి.


మారుతీ సుజుకి జిమ్నీ
మారుతి సుజుకి జిమ్నీ ఈ సంవత్సరం కంపెనీ చేయనున్న అతిపెద్ద లాంచ్‌లలో ఒకటి. ఐదు డోర్ల జిమ్నీ లాడర్ :ఫ్రేమ్ ఛాసిస్, ఆఫ్-రోడ్ కెపాసిటీతో లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీగా లాంచ్ కానుంది. ఇందులో 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 105 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లాంచ్ కానుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండవచ్చు.


బీఎండబ్ల్యూ ఎం2
BMW రెండో తరం ఎం2ను మనదేశంలో విడుదల చేయబోతుంది. ఇది పూర్తిగా ఇంపోర్టెడ్ మోడల్. ఎం2 కారు 3.0 లీటర్ ట్విన్ టర్బో ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ పవర్ ఫుల్ ఇంజిన్‌ను పొందుతుంది, ఇది 460 హెచ్‌పీ పవర్‌ను, 550 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో రానుంది. ఎం సిరీస్‌లో ఇదే చివరి ICE మోడల్. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర కోటి రూపాయలు ఉంటుందని అంచనా.


టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ
భారతదేశంలో సీఎన్‌జీ కార్లు ప్రజాదరణ పొందుతున్నాయి. టాటా మోటార్స్ తన ఆల్ట్రోజ్ కారుకు సంబంధించిన సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆల్ట్రోజ్ సీఎన్‌జీ బుకింగ్‌లు ఇప్పటికే రూ. 21,000 టోకెన్ మొత్తంతో ప్రారంభమయ్యాయి. ఇది XE, XM+, XZ, XZ+ ట్రిమ్‌లలో అందుబాటులో ఉండనుంది.


ఈ కారు అల్లాయ్ వీల్స్, ఆటో ఏసీ, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి టాప్-స్పెక్ ట్రిమ్ ఫీచర్లను పొందుతుంది. 1.2 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్‌ను టాటా అల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్ పొందుతుంది. ఇది CNG మోడ్‌లో 77 హెచ్‌పీ శక్తిని, 97 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెయిర్ కానుంది.


బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐ
బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐలో హై పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ లాంచ్ కానుంది. ఇది 3.0 లీటర్ 6 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 360 హెచ్‌పీ శక్తిని, 500 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం అయి ఉంటుంది. దీనితో పాటు కొన్ని డిజైన్ అప్‌డేట్‌లు కూడా ఇందులో కనిపిస్తాయి. ఎక్స్3 ఎం40ఐ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. బుకింగ్ అమౌంట్ రూ. 5 లక్షలుగా ఉంది.