Cars Launching in April: కొత్త ఆర్థిక సంవత్సరం నేటి నుంచి (ఏప్రిల్ 1వ తేదీ) ప్రారంభమైంది. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో చాలా పెద్ద కంపెనీలు కొత్త కార్లతో మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో ఫేస్‌లిఫ్ట్‌లతో పాటు పూర్తిగా కొత్త వాహనాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఏ కార్లు లాంచ్ కానున్నాయో చూద్దాం.
టయోటా టేజర్ (Toyota Taisor)
టయోటా టేజర్ ఏప్రిల్ 3వ తేదీన మార్కెట్లోకి విడుదల కానుంది. టయోటా లాంచ్ చేయనున్న ఈ కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారంగా రూపొందించారు. టయోటా తన కాంపాక్ట్ ఎస్‌యూవీకి అర్బన్ క్రూయిజర్ టేజర్ అని పేరు పెట్టవచ్చు. ఈ టయోటా వాహనం 1.2 లీటర్ టర్బో ఇంజన్‌తో రానుంది. టయోటా లైనప్‌లోని ఈ కారు పెట్రోల్ వేరియంట్‌లో మార్కెట్లోకి రావచ్చు. దీని సీఎన్‌జీ, డీజిల్ వేరియంట్‌లు తర్వాత మార్కెట్లోకి రానున్నాయి. ఈ కారు ధర దాదాపు రూ.8 లక్షలు ఉండవచ్చు.
2024 మహీంద్రా ఎక్స్‌యూవీ300 (2024 Mahindra XUV300)
మహీంద్రా ఎక్స్‌యూవీ300 అప్‌డేటెడ్ మోడల్‌ను కూడా ఈ నెలలో విడుదల చేయవచ్చు. టెస్టింగ్ డ్రైవ్‌ల సమయంలో ఈ వాహనం చాలాసార్లు రోడ్లపై కనిపించింది. ఈ కారులో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లే సెటప్ ఉండవచ్చు. ఈ మోడల్ ధర గురించి చెప్పాలంటే మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధర సుమారు రూ. 8.5 లక్షల వరకు ఉండవచ్చు.
కొత్త మారుతి స్విఫ్ట్ (New Maruti Swift)
మారుతి సుజుకి స్విఫ్ట్ నాలుగో తరం మోడల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. మారుతి రూపొందించిన ఈ మోడల్ గ్లోబల్ లాంచ్ ఇప్పటికే అయిపోయింది. ఇటీవలే ఈ మోడల్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా విడుదలైంది. ఈ వాహనంలో 9 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటో ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ధర దాదాపు రూ.6 లక్షలు ఉండవచ్చు.
స్కోడా సూపర్బ్ (Skoda Superb)
స్కోడా సూపర్బ్ లాంచ్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ నెలలోనే ఈ కారును భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ సెడాన్‌లో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 190 బీపీఎస్ శక్తిని, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. స్కోడా సూపర్బ్ సెడాన్ ధర దాదాపు రూ.40 లక్షలు ఉండవచ్చు.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ (Tata Altroz Racer)
టాటా తన కొత్త మోడల్ ఆల్ట్రోజ్ రేసర్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్‌తో ఎక్విప్ కానుంది. టాటా ఈ కారులో 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తోంది. అలాగే టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఉంది. ఈ కారు ధర దాదాపు రూ.10 లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది.