Waiting Period on Toyota Cars: టయోటా తన ఫార్చ్యూనర్, హిలక్స్, క్యామ్రీ, వెల్‌ఫైర్ కార్ల వెయిటింగ్ పీరియడ్ వివరాలను విడుదల చేసింది. కారును బట్టి ఒక నెల నుంచి దాదాపు 10 నెలల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.


టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner)
టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ రెండు ఇంజన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ 166 హెచ్‌పీ పవర్, 245 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయనుంది. దీంతోపాటు 204 హెచ్‌‌పీ పవర్, 500 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉన్నాయి. ఈ రెండు ఇంజన్లు ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. అయితే డీజిల్ ఇంజన్ 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానుంది. టయోటా ఫార్చ్యూనర్ ఎంజీ గ్లోస్టర్, ఇసుజు ఎంయూ-ఎక్స్‌లతో పోటీ పడుతోంది. దీని కోసం ఒకట్రెండు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 33.43 లక్షల నుంచి 51.59 లక్షల మధ్య ఉంది.


టయోటా హిలక్స్ (Toyota Hilux)
టయోటా హిలక్స్ 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో ఫార్చ్యూనర్ తరహాలో అదే 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పవర్‌ని పొందుతుంది. 204 హెచ్‌పీ పవర్‌తో రెండు గేర్‌బాక్స్‌లకు పవర్ అవుట్‌పుట్ ఒకే విధంగా అందించనుంది. అయితే టార్క్ పరంగా చూసుకుంటే మాన్యువల్‌తో 420 ఎన్ఎం, ఆటోమేటిక్‌తో 500 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను అందించనుంది. ఇది ఇసుజు డి మ్యాక్స్ వి క్రాస్‌తో (రూ. 19.5 లక్షల నుంచి రూ. 27 లక్షల మధ్య) పోటీపడుతుంది. దీని కోసం ఒక నెల వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 30.4 లక్షల నుంచి రూ. 38.05 లక్షల మధ్య ఉంది.


టయోటా క్యామ్రీ (Toyota Camry)
4.8 మీటర్ల పొడవుతో హైబ్రిడ్ టయోటా క్యామ్రీ సెడాన్ చాలా సౌకర్యవంతంగా, పవర్ ఫుల్‌గా ఉంటుంది. 120 హెచ్‌పీ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో, 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు అందుబాటులో ఉంది. 218 హెచ్‌పీ పవర్, 221 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది. ఈ కారు 23.27 కిలోమీటర్ల మైలేజీని డెలివర్ చేయనుంది. భారత మార్కెట్లో క్యామ్రీకి ఒక నెల వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 46.17 లక్షల నుంచి రూ. 46.32 లక్షల మధ్య ఉంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!


టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire)
కొత్త టయోటా వెల్‌ఫైర్ గత సంవత్సరం భారతదేశంలో లాంచ్ అయింది. ఈ ఎంపీవీ సెలబ్రిటీల్లో ప్రత్యేకమైన ప్రజాదరణ పొందింది. వెల్‌ఫైర్ గొప్ప ఇంటీరియర్ సెటప్‌ను కూడా కలిగి ఉంది. ఇది కాకుండా అనేక గొప్ప ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి. టయోటా వెల్‌ఫైర్ 193 హెచ్‌పీ, 240 ఎన్ఎం పీక్ టార్క్‌ను డెలివర్ చేసే 2.5 లీటర్, నాలుగు సిలిండర్ల హైబ్రిడ్ ఈ-సీవీటీ పవర్‌ట్రెయిన్‌తో రానుంది. టయోటా వెల్‌ఫైర్ 19.28 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని కోసం 10 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.19 కోట్ల నుంచి రూ. 1.29 కోట్ల మధ్య ఉంది.