Mann ki Baat Break: మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ్టి (ఫిబ్రవరి 25) ఎపిసోడ్‌లో ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలను (Lok Sabha Polls 2024) దృష్టిలో ఉంచుకుని వచ్చే మూడు నెలల పాటు మన్ కీ బాత్‌ని కొనసాగించలేనని స్పష్టం చేశారు. మార్చి నెలలో Model Code of Conduct (MCC) అమల్లోకి వచ్చే అవకాశముందని, ఈ కారణంగానే మన్ కీ బాత్ కార్యక్రమానికి బ్రేక్ ఇవ్వక తప్పదని వివరించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ మన్ కీ బాత్ కార్యక్రమానికి ఇదే విధంగా విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆ విషయాన్నే గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతను ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగేలా అందరూ ఓటు వేయాలని కోరారు.
"మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజల కోసమే పెట్టాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితోనే దీన్ని కొనసాగిస్తున్నాను. కానీ...లోక్‌సభ ఎన్నికల కారణంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే నెలలో అమల్లోకి వచ్చే అవకాశముంది. అందుకే వచ్చే మూడు నెలల పాటు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కొనసాగించడం కుదరదు. ఈ విరామం తరవాత 111వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో మీ అందరితో నేను మాట్లాడతాను. ఈ సంఖ్య చాలా శుభప్రదమైంది కూడా. లోక్‌సభ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని రికార్డు సృష్టించాలని కోరుకుంటున్నాను. "
- ప్రధాని నరేంద్ర మోదీ
గుజరాత్‌లోని ద్వారకాలో భారత్‌లోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్ Sudarshan Setu ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఓఖా, బెయిత్ ద్వారకా ద్వీపాలను కలుపుతూ ఈ వంతెనని నిర్మించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.979 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఓల్డ్ ద్వారకా, న్యూ ద్వారకాని ఇది అనుసంధానం చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. నాలుగు లేన్‌లతో ఈ నిర్మాణం చేపట్టారు. 27.20 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఫుట్‌పాత్ కోసం 2.50 మీటర్ల వెడల్పుని కేటాయించారు. ఈ ఫుట్‌పాత్‌నీ చాలా ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. గోడలపై భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు పెయింట్ చేశారు. ముందు దీన్ని Signature Bridge గా చెప్పిన ప్రభుత్వం ఆ తరవాత సుదర్శన్ సేతు అనే పేరు పెట్టింది.ఓఖా పోర్ట్‌కి సమీపంలో ఉన్న Beyt Dwarkaలో శ్రీకృష్ణుడి ద్వారాకాధీష్ ఆలయం (Dwarkadhish temple) ఉంది. ఈ వంతెనను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు.