Auto Sales October 2023: దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ క్రమంగా పెరుగుతూ ఉంది. 2023 అక్టోబర్‌లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అమ్ముడుపోయాయి. ఈ విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే ఈ జాబితాలో కొత్త కంపెనీలు కూడా చేరాయి. అయితే 2023 అక్టోబర్‌లో ఎక్కువగా అమ్ముడు పోయిన టాప్-5 ఎలక్ట్రిక్ బ్రాండ్ల గురించి తెలుసుకుందాం.
ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)
2023 అక్టోబర్‌లో అమ్మకాల పరంగా ఓలా ఎలక్ట్రిక్ ముందంజలో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు పడుతూ లేస్తూ సాగుతున్నాయి. గత నెలలో ఓలా 22,284 స్కూటర్లను విక్రయించింది. 2023 సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 18,691 యూనిట్లుగా ఉంది. అంటే సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో 19.2 శాతం పెరుగుదలను నమోదు చేసిందన్న మాట.
టీవీఎస్ మోటార్స్ (TVS Motors)
భారతదేశంలో ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించే టీవీఎస్ మోటార్స్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉంది. 2023 అక్టోబర్‌లో టీవీఎస్ ఐక్యూబ్‌కి సంబంధించి 15,603 యూనిట్లను విక్రయించింది. 2023 సెప్టెంబర్‌లో అమ్ముడుపోయిన 15,584 యూనిట్లతో పోలిస్తే, నెలవారీగా 0.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
బజాజ్ (Bajaj Electric)
మూడో స్థానాన్ని బజాజ్ చేతక్ (Bajaj Chetak Electric) ఎలక్ట్రిక్ స్కూటర్ దక్కించుకుంది. ఇది కంపెనీ అందిస్తున్న ఏకైక ఆల్ ఎలక్ట్రిక్ ఆఫర్. 2023 అక్టోబర్‌లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌కు సంబంధించి 8,430 యూనిట్లు అమ్ముడుపోయాయి. నెలవారీగా 18.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023 సెప్టెంబర్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే చేతక్ 7,097 యూనిట్లను బజాజ్ విక్రయించింది.
ఏథర్ పవర్ (Ather Power)
అత్యంత విజయవంతమైన ఈవీ స్టార్టప్‌లలో ఒకటైన ఏథర్... గత నెలలో 8,027 యూనిట్లను విక్రయించి అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. 2023 సెప్టెంబర్‌లో ఏథర్‌కు సంబంధించి 7,151 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో 12.2 శాతం వృద్ధి నమోదైంది.
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ (Greaves Electric)
ఈ కంపెనీ పేరును మీలో చాలా మంది వినడం ఇదే మొదటిసారి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 2023 అక్టోబర్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ల టాప్ 5 జాబితాలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కూడా చేరింది. ఈ కంపెనీ గత నెలలో 4,019 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కూడా 3,612 యూనిట్లను విక్రయించింది. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబరులో 11.2 శాతం వృద్ధి నమోదు చేసింది.
మరోవైపు 1960, 1970ల దశకంలో భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ లాంబ్రెట్టా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆధునిక, దేశీయ స్కూటర్ బ్రాండ్లు వచ్చిన తర్వాత ఈ ఇటాలియన్ బ్రాండ్ అప్పట్లోనే భారతదేశం నుంచి కనుమరుగు అయిపోయింది. యూరోపియన్ మార్కెట్లలో మాత్రం టూ వీలర్ విభాగంలో లాంబ్రెట్టా బలమైన బ్రాండ్‌గా మిగిలిపోయింది. లాంబ్రెట్టా ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. కంపెనీ తన మొదటి బ్యాటరీ ఆపరేటెడ్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈఐసీఎంఏ 2023లో లాంబ్రెట్టా తన మొదటి ప్రొటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రదర్శించడం ద్వారా ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఎలెట్రా అనే ఈ ప్రోటోటైప్ క్లాసిక్ లాంబ్రెట్టా స్కూటర్‌కి అధునాతన వెర్షన్‌గా మార్కెట్లోకి రానుంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!