Pakistan Cricketer Abdul Razzaq Says Sorry To Aishwarya Rai: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌(Aishwarya Rai Bachchan)పై ఓ టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌(Abdul Razzaq) దిగివచ్చాడు. చేసిన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు. ఐశ్యర్యరాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి రజాకపై విమర్శల జడివాన కురిసింది. సర్వత్రా విమర్శలు వస్తుండడంతో అబ్దుల్‌ రజాక్ దిగి వచ్చాడు. ఐశ్యర్యారాయ్‌కు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాడు. తాను టీవీ చర్చా కార్యక్రమంలో క్రికెట్‌ కోచింగ్‌, దాని ఉద్దేశాలను గురించి మాట్లాడూతు నోరుజారి ఐశ్వర్య గురించి మాట్లాడానని రజాక్‌ పశ్చాతాపపడ్డాడు. నోరు జారినందుకు ఐశ్వర్యకు తాను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్లు అబ్దుల్ రజాక్‌ తెలిపాడు. తనకు ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం లేదని.. కానీ అనుకోకుండా అలా జరిగిపోయిందని ఈ పాక్‌ మాజీ క్రికెటర్‌ తెలిపాడు. 


ఇదే కార్యక్రమంలో పాల్గొని అబ్దుల్‌ రజాక్‌.. ఐశ్వర్యపై మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టిన షాహిద్‌ అఫ్రిదీ కూడా ఈ విషయంపై స్పందించాడు. తాను ఇంటికి వచ్చిన తర్వా అబ్దుల్‌ రజాక్‌ ఏం మాట్లాడాడో చూశానని.. అందుకే స్పందించేందుకు సమయం పట్టిందని షాహిద్ అఫ్రిదీ తెలిపాడు. అబ్దుల్‌ రజాక్‌ చేతిలో మైక్‌ ఉంటే ఏదో ఒకటి నోరుజారి మాట్లాడుతాడని తనకు ముందే తెలుసని.. అలా మాట్లాడే గతంలోనూ చాలాసార్లు అతడు తిట్టు తిన్నాడని.. అలా తిట్లు తినడం రజాక్‌కు అలవాటుగా మారిందని అఫ్రిదీ అన్నాడు. ఇంట్లో ఆ క్లిప్‌ చూసిన వెంటనే క్షమాపణలు చెప్పాలని అబ్దుల్‌ రజాక్‌కు మెసేజ్‌ చేశానని.. అఫ్రిది వెల్లడించాడు. ఇదే షోలో పాల్గొన్న ఉమర్‌ గుల్‌ కూడా అబ్దుల్‌ రజాక్‌ అనుచిత వ్యాఖ్యలపై స్పందించాడు. రజాక్‌ మాట్లాడిన దానిని సమర్థిస్తూ తాను, అఫ్రిది చప్పట్లు కొట్టలేదని ఉమర్‌గుల్‌ తేల్చి చెప్పాడు. రజాక్‌ మాట్లాడింది నైతికంగా తప్పని... ఆ సంభాషణలో పాల్గొనని వారి పేర్లను అనవసరంగా వివాదంలోకి లాగావద్దని గుల్‌ కోరాడు. 


మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రజాక్‌కు ఇదే తొలిసారి కాదు. 2021లో పాక్‌ మహిళా క్రికెటర్‌ నిదా దార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహిళలు క్రికెటర్లుగా మారితే.. పురుషులతో సమానంగా ఉండాలనుకుంటారు. లేదా ఇంకా మెరుగ్గా ఉండాలనుకుంటారు. పురుషులే కాదు తామూ కూడా బాగా ఆడతామని నిరూపించుకోవాలని చూస్తారు. దాంతో వాళ్లు అత్యుత్తమ క్రీడాకారులుగా ఎదిగేసరికి వివాహం చేసుకోవాలనే ఆశ సన్నగిల్లుతుంది. ఇప్పుడు నిదాకు షేక్‌ హ్యాండిస్తే మహిళ అనే భావన కూడా కలగదని రజాక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అప్పట్లో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి.


వన్డే ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ ప్రదర్శనపై ఓ టీవీ చర్చా వేదికలో అబ్దుల్‌ రజాక్‌, షాహీద్‌ అఫ్రిదీ, ఉమర్‌ గుల్‌,యూనిస్‌ ఖాన్‌, సయీద్ అజ్మల్, షోయబ్‌ మాలిక్, కమ్రాన్‌ అక్మల్‌ పాల్గొన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఉద్దేశం సరిగా లేదని వ్యాఖ్యానిస్తూ అబ్దుల్‌ రజాక్‌.. బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌ పేరును మధ్యలోకి తీసుకొచ్చాడు. క్రికెట్‌ను బాగు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏమాత్రం లేదన్న రజాక్‌ అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా వస్తాయని విమర్శించాడు. అంతటితో ఆగకుండా తాను ఐశ్వర్యారాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన పిల్లలు పుడతారని అనుకుంటే అది ఎప్పటికీ జరగదు కదా. ఇది కూడా అంతే అని... అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అబ్దుల్‌ రజాక్‌ చేసిన వ్యాఖ్యలకు  షాహిద్ అఫ్రిదీ, ఉమర్‌గుల్‌. నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దీంతో భారత అభిమానులకు బాగా హర్ట్‌ అయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ మాజీ క్రికెటర్లకు గట్టిగా ఇచ్చి పడేశారు.


Also Read: దిగజారిన అబ్దుల్‌ రజాక్‌, ఐశ్యర్యపై అనుచిత వ్యాఖ్యలు