Affordable SUVs in India: ప్రస్తుతం మనదేశంలో పండుగల సీజన్ నడుస్తోంది. వినియోగదారులు తమ కలల కారును కొనుగోలు చేసేందుకు కంపెనీలు రకరకాల ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ఏ ఇతర సెగ్మెంట్‌తో పోల్చినా, సెడాన్‌లు లేదా హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎస్‌యూవీలు అమ్మకాల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం ఉత్తమమైన, తక్కువ ధరలో లభించే ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం. వీటిని రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.


హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
దాని గొప్ప ఫీచర్లు, తక్కువ ధర కారణంగా కొత్త ఎక్స్‌టర్ ఇప్పుడు దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటి. ఎక్స్‌టర్ హ్యుందాయ్ విక్రయిస్తున్న అతి చిన్న SUV కావచ్చు. కానీ ఫీచర్ల పరంగా దాని ఏఎంటీ వేరియంట్‌లో డాష్‌క్యామ్, ప్యాడిల్ షిఫ్టర్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఓటీఏ అప్‌డేట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ కెమెరా, సన్‌రూఫ్ వాయిస్ ఉన్నాయి. ఇక దీని కొలతల గురించి మాట్లాడినట్లయితే ఎక్స్‌టర్ పొడవు 3,815 మిల్లీమీటర్లుగా ఉంది. దీని వెడల్పు 185 మిల్లీమీటర్లు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 1710 మిల్లీమీటర్లుగా ఉంది. ఎక్స్‌టర్ 1.2 లీటర్ పెట్రోల్‌తో మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6 లక్షలుగా ఉంది.


మారుతీ సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
ఫ్రాంక్స్ దాని స్టైలింగ్, వాల్యూతో మమ్మల్ని ఆకట్టుకుంది. అయితే దీని కూపే లాంటి రూఫ్... డిజైన్ పరంగా భిన్నంగా ఉంటుంది. హెడ్‌ల్యాంప్ డిజైన్, ఫ్రంట్ ఎండ్ పెద్ద గ్రాండ్ విటారా మాదిరిగానే ఉంటాయి. అయితే స్లాంటెడ్ రూఫ్‌లైన్ డిజైన్ ఈ కారును ప్రత్యేకంగా చేస్తుంది. దీని కొలతల గురించి మాట్లాడినట్లయితే పొడవు 3,995 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,765 మిల్లీమీటర్లు గానూ, గ్రౌండ్ క్లియరెన్స్ 190 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఫ్రంట్‌లో క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్‌ల గురించి చెప్పాలంటే ఇది మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్‌తో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌‌తో లభిస్తుంది. దీని ధర రూ.7.4 లక్షల నుంచి మొదలవుతుంది.


టాటా పంచ్ (Tata Punch)
టాటా పంచ్ దాని బలం, డిజైన్ కారణంగా పంచ్ ఎల్లప్పుడూ ఈ విభాగంలో పెద్ద విక్రయదారుగా ఉంది. ఇటీవల టాటా మోటార్స్ తన ఎస్‌యూవీకి వాయిస్ అసిస్ట్, ఆటో హెడ్‌ల్యాంప్‌లతో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అనేక కొత్త ఫీచర్లను జోడించింది. ఇక టాటా పంచ్ కొలతల గురించి మాట్లాడినట్లయితే, దాని పొడవు 3827 మిల్లీ మీటర్లు కాగా, వెడల్పు 1742 మిల్లీమీటర్లు గానూ, గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిల్లీమీటర్లుగానూ ఉంది. దీని ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఇది హారియర్ తరహా ఫ్రంట్ ఎండ్ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ప్రారంభ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!