తెలంగాణ తెలుగు దేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తెలుగు దేశం అధిష్ఠానం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు (నవంబర్ 3) ఉదయం 11.30 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా పరిమిత సంఖ్యలో తన అనుచర నాయకులతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకొనున్నట్లు తెలుస్తోంది. 


గోషా మహల్ టికెట్ ఇచ్చే అవకాశం
కాసాని జ్ఞానేశ్వర్ కు గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గం నుంచి ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన సునీతరావుకు టికెట్ కేటాయించింది. వివిధ కారణాలతో కేసీఆర్ ఇప్పటి దాకా గోషామహల్ నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించలేదు.


ముదిరాజ్ సామాజిక వర్గానికి బీఆర్ఎస్ ఈసారి ఒక్క టికెట్ కూడా కేటాయించలేదు. 50 లక్షల ఓట్లున్న తమను అధికార పార్టీ లెక్క చేయడం లేదని ముదిరాజ్ సామాజికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు గతంలో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్ చేరిక తమకు కలిసి వస్తుందని కేసీఆర్ భావించి గోషామహల్ టికెట్ ఇస్తారని తెలుస్తోంది.  


ఎన్నికలకు దూరంగా టీడీపీ 
తెలంగాణలో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీడీపీ అధిష్ఠానం తేల్చి చెప్పడంతో అసంతృప్తికి గురైన కాసానిజ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.