భయం.. ఈ ఎమోషన్ తో చాలామంది ఆడుకుంటుంటారు. ముఖ్యంగా పల్లెల్లో ఏదైనా అనుకోని, ప్రమాదకర ఘటన జరిగినప్పుడు దానిపై పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తాజాగా, శ్రీకాకుళం జిల్లాలో పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో పులి సంచారం విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏ చిన్న ఘటనా జరిగినా దీనికే ముడిపెడుతూ కొందరు సోషల్ మీడియాలో ఫేక్ సమాచారంతో అతి చేస్తున్నారు. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఫేక్ వార్తలు ప్రచారం చెయ్యకుండా పోలీసులు కట్టడి చేయాలని కోరుతున్నారు.
వారం రోజులుగా
శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాల్లో పెద్ద పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారం రోజులుగా పలాస, మందస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో పులి సంచరిస్తోంది. మంగళవారం రాత్రి కవిటి, కంచిలి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆవులు, గేదెలపై దాడి చేసింది. కంచిలి మండలం మండపల్లిలో మాదిన హరిబాబుకు చెందిన ఆవుపై దాడి చేసి పొదల్లోకి లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆవు మృతి చెందింది. ఉదయం తోటకు వెళ్లిన రైతు.. మృతి చెందిన ఆవును గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సహలాలపుట్టుగలో ఆవు, కొండిపుట్టుగలో గేదె దూడపై పులి దాడి చేయడంతో అవి మృతి చెందాయి. గుజ్జుపుట్టుగ గ్రామంలో ఆవు దూడకు తీవ్ర గాయాలయ్యాయి. అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ, ఈదుపురం, కొఠారీ, ధర్మపురం, రాజపురం పరిసర ప్రాంతాల్లో సంచరించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎ.మురళీకృష్ణంనాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఆయా గ్రామాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రాంతాల వారిని అలర్ట్ చేశారు.
వందతులపై బీ అలర్ట్
అయితే, పులి సంచారంపై సోషల్ మీడియాలో వదంతులు సైతం అంతే వేగంగా షికారు చేస్తున్నాయి. తమ ప్రాంతంలో పులిని చూశామని కొందరు, తమ ప్రాంతంలో పులి పశువులపై దాడి చేసి చంపిందని ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. కాగా, కొన్నింటిపై ఎలాంటి అధికారిక సమాచారం ఉండడం లేదు. ఇలాంటి పుకార్లతో ఆయా ప్రాంతాల ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
సోంపేట వాసులకు హెచ్చరిక
సోంపేట మండల పరిధిలోని మండపల్లి, చీకటి సోంపేట పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని, ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. సాయంత్రం 5 తర్వాత ఉదయం 6 గంటల లోపు ఎవ్వరూ ఒంటరిగా తిరగొద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. రాత్రి సమయంలో పశువులను నివాస ప్రాంతాలకు దూరంగా విడిచిపెట్టొద్దని పోలీసులు సూచించారు. పెద్దపులిని పట్టుకోవడానికి అటవీ శాఖా, పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అప్పటి వరకు సోంపేట మండల ప్రజలు జాగ్రత్తగగా ఉండాలన్నారు. పెద్దపులి సంచారం గురించి తెలిస్తే కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 94924 19724, 85010 08880కు సమాచారం ఇవ్వాలని కోరారు.
గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో పులి సంచారం ఉందని, అక్టోబర్ 25న తొలిసారి పులి సంచారం గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అప్పటి నుంచి పులి జాడ కనుక్కొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పులి సంచారంపై ఆందోళన వద్దని, ఏవైనా అనుమానాస్పద గుర్తులు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఏమైనా పెంపుడు జంతువులపై పులి దాడి చేసి చంపేస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు.
Also Read: 'ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టడమే లక్ష్యం' - ఐసీఐడీ ప్లీనరీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు