రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ తెలిపారు. విశాఖ రాడిసన్ బ్లూ హోటల్ లో సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జల వనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 25వ ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాన్ని, ఆయన కేంద్ర మంత్రి షెకావత్ తో కలిసి గురువారం ప్రారంభించారు. సుమారు 90 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ నెల 8 వరకూ ప్లీనరీ జరగనుంది. తొలుత ముఖ్య అతిథులను సత్కరించిన అనంతరం వారికి నిర్వాహకులు జ్ఞాపికలు బహూకరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్ సైతం పాల్గొన్నారు.
శుభ పరిణామం
విశాఖలో నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభ పరిణామమని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో విస్తారమైన తీర ప్రాంతం ఉందని, దాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నామని పేర్కొన్నారు. సాగునీరు, వ్యవసాయం రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతీ నీటిబొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యమని అన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరువు వస్తోందని చెప్పారు. వర్షాలు తక్కువున్న సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
'అప్పుడే నీటి లభ్యత'
దిగువ నదీ తీర రాష్ట్రంగా నీటి నిర్వహణ కోసం ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోందన్నారు సీఎం జగన్. వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి నదులు ఉన్న అతివృష్టి, అనావృష్టి వల్ల నీటి నిర్వహణ పెను సవాల్ గా మారిందని వివరించారు. నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, నీటిని ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు తరలించే వ్యవస్థ ఏర్పాటు కావాలని అన్నారు. అప్పుడే అన్ని వేళలా, అన్ని ప్రాంతాలకూ నీటి లభ్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రైతులకు మేలు జరిగేలా చర్యలు
దేశంలో రైతులకు మేలు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జల సంరక్షణ చర్యలు చేపట్టామని, భూగర్భ జలాల సంరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచ దేశాలకు భారత్ అతి పెద్ద ఎగుమతిదారుగా వృద్ధి చెందుతోందన్నారు. వాటర్ రీ సైక్లింగ్ విధానంతో మురికి నీటిని శుద్ధి చేస్తున్నామని, తాగు, సాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 2019లో మోదీ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ ప్రారంభించామని, దీని ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, నదుల అనుసంధాన ప్రక్రియ సైతం వేగంగా జరుగుతోందని షెకావత్ తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని నదులను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ల ద్వారా డ్యామ్ ల పరిరక్షణ జరుగుతోందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ప్రపంచ బ్యాంకు సహకారంతో డ్యామ్స్ పరిరక్షిస్తున్నట్లు వివరించారు.
Also Read: ఏపీలో త్వరలో మరింత ఎక్కువ వర్షాలు - తెలంగాణలో స్వల్పంగానే: ఐఎండీ