ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ, తూర్పు దిశల్లో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.


అక్టోబరు 31 నుంచి నవంబరు 4 వరకూ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నమోదు కాబోయే అత్యల్ప ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 31 నుంచి 5 రోజుల పాటు తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదు కానున్నట్లు అంచనా వేశారు. 


ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


‘‘బంగాళాఖాతం మీదుగా నుంచి దూసుకొస్తున్న తూర్పు గాలులు (EASTERLIES) నేడు ఉత్తరాంధ్ర​, ఉభయ గోదావరి జిల్లాల మీదుగా ప్రభావం చూపనున్నాయి. దీని వలన ముఖ్యమైన ప్రాంతాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాలు కాకుండా నేడు ఉత్తరాంధ్ర​, మధ్యాంధ్ర, ఉభయ గోదావరి, మధ్య ఆంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మధ్యాహ్నం - సాయంకాలం సమయంలో వర్షాలను చూడగలం. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలను నేడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం మధ్యలో చూడగలం. 


అలాగే రేపు ఉదయం సమయంలో అన్ని కోస్తా జిల్లాల​ మీదుగా వర్షాలుంటాయి. రేపు ఉదయం నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కూడ అక్కడక్కడ వర్షాలను చూడగలం. విశాఖ నగరం వాతావరణ పరిస్ధితి - నేడు విశాఖలో మధ్యాహ్నం సమయంలో చెదురుముదురుగా తేలికపాటి - మోస్తరు వర్షాలు ఉంటాయి. చెదురుముదురుగా అంటే అక్కడక్కడ అని అర్ధం. మరో వైపున రేపు ఉదయం కూడ కొన్ని వర్షాలను విశాఖ నగరంలో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు మధ్యాహ్నం పడకపోయినా, రేపు ఉదయం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.