Israel Palestine Attack: 



మళ్లీ ఇదే రిపీట్ అవుతుంది: హమాస్ ప్రతినిధి 


ఇజ్రాయేల్‌పై చేసిన దాడుల్ని (Israel Hamas War) సమర్థించుకుంటోంది హమాస్. అక్టోబర్ 7న ఉన్నట్టుండి మెరుపు దాడులు మొదలు పెట్టింది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అయితే...హమాస్‌ని అంతం చేసేంత వరకూ వదలం అని ఇజ్రాయేల్ శపథం చేసింది. ప్రధాని బెంజిమన్ నెతన్యాహు చాలా పట్టుదలతో ఉన్నారు. గాజా వద్ద ఉన్న బంకర్లపై దాడులు చేస్తోంది ఇజ్రాయేల్ సైన్యం. శరణార్థుల క్యాంప్‌లలోనూ హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న అనుమానంతో వాటిపైనా దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే హమాస్ ప్రతినిధి ఘాజీ హమాద్ (Ghazi Hamad) చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇజ్రాయేల్‌కి గుణపాఠం నేర్పేందుకు మళ్లీ మళ్లీ దాడులు చేసేందుకైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. Middle East Media Research Institute (MEMRI) ఈ వ్యాఖ్యల్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇజ్రాయేల్‌పై దాడి చేసినందుకు తాము సిగ్గుపడడం లేదని స్పష్టం చేశారు ఘాజీ హమాద్. 


"ఇజ్రాయేల్‌పై దాడి చేశామే అని మేమేమీ సిగ్గు పడడం లేదు. అసలు ఆ గిల్ట్‌ లేనే లేదు. ఇజ్రాయేల్‌కి గుణపాఠం నేర్పాలనుకున్నాం కాబట్టే దాడులు చేశాం. మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం. మా నేలపై వాళ్ల పెత్తనం ఉండనే కూడదు. వాళ్లకు ఆ హక్కు లేదు. పాలస్తీనా ప్రజలకు ఆక్రమణల బాధితులుగా మిగిలిపోవాల్సిన ఖర్మ లేదు. మా దాడులతో అయినా ఇజ్రాయేల్ ఆక్రమణలు ఆగిపోతాయని అనుకుంటున్నాం. పాలస్తీనాకి చెందిన నేలను ఇజ్రాయేల్ ఆక్రమించడం ఆగిపోవాలి"


- ఘాజీ హమాద్, హమాస్ ప్రతినిధి 


దేనికైనా సిద్ధమే..


ఇజ్రాయేల్‌ని పూర్తిగా అంతమొందించాలని అన్నారు ఘాజీ హమాద్. హమాస్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. పౌరుల ప్రాణాలు తీయడం హమాస్ ఉద్దేశం కాదని అన్నారు. 


"ఇజ్రాయేల్‌ని పూర్తిగా అంతమొందిచాలన్నదే మా లక్ష్యం. రాజకీయ లబ్ధి మాత్రమే చూసుకుంటోంది. అయినా పౌరులపై దాడులు చేయాలన్నది మా ఉద్దేశం కాదు. అసలు ఇజ్రాయేల్ ఉనికే అనైతికం. ఇజ్రాయేల్ కారణంగానే ఇంత హింస జరుగుతోంది. ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రక్తం ఏరులై పారుతోంది. ఇజ్రాయేల్ ఆక్రమణలకు మేం బాధితులుగా మారిపోయాం. అలాంటప్పుడు మేం దాడి చేయడంలో తప్పేముంది..? సిగ్గు పడాల్సిన పనేముంది. ఇకపై ఎప్పుడు దాడి చేసేందుకైనా మేం వెనకాడం. మా దాడులకు మేం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా అందుకు సిద్ధమే"


- ఘాజీ హమాద్, హమాస్ ప్రతినిధి 


గాజాపై ఇజ్రాయేల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో (Israel Hamas War) ఎంతో మంది పౌరులు బలి అవుతున్నారు. ఇటీవల  Israeli Defence Forces (IDF) గాజాలోని అతి పెద్ద  శరణార్థుల శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 50 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనా హోం మంత్రిత్వ శాఖ ఈ విషయం వెల్లడించింది. అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై దాడి చేసిన హమాస్‌ కమాండర్లలో ఒకరు తమ దాడుల్లో  హతమైనట్టు ఇజ్రాయేల్ ప్రకటించింది. దాదాపు నాలుగు రోజులుగా గాజాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది ఇజ్రాయేల్ సైన్యం. పదుల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు ఇక్కడి సొరంగాల్లో దాక్కున్నట్టు ఇజ్రాయేల్ సైన్యం పసిగట్టింది. అందుకే వరుస పెట్టి దాడులు చేస్తోంది. ఇక్కడి బియారి టన్నెల్ (Biari Tunnel)లో చాలా మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు గుర్తించింది.


Also Read: హైకమాండ్‌కి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేల అల్టిమేటం, ఏదోటి తేల్చేయాలంటూ డిమాండ్