Tesla RHD Car: ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి పూర్తి సన్నాహాలు చేస్తోంది. మార్కెట్లోకి అడుగుపెట్టడంతో పాటు కార్ల తయారీ కంపెనీ భారతీయ డ్రైవర్ల గురించి కూడా ఆలోచిస్తోంది. భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్లా రైట్ హ్యాండ్ డ్రైవర్ల కోసం కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ ఇటువంటి కార్లను తయారు చేయడం ఇదే మొదటిసారి. కంపెనీ తన బెర్లిన్ ఫ్యాక్టరీలో ఇటువంటి కార్లను తయారు చేస్తోంది.
భారతదేశంలో టెస్లా పెట్టుబడి
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం టెస్లా భారతదేశంలో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. టెస్లా బృందం ఏప్రిల్ మూడో వారంలో భారతదేశాన్ని సందర్శిస్తుంది. ఇది భారతదేశంలో ఎక్కడ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయవచ్చో నిర్ణయిస్తుంది. టెస్లా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో తన ప్లాంట్లను ఏర్పాటు చేయగలదు. గత నెలలో భారత ప్రభుత్వం జారీ చేసిన ఈవీ పాలసీని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది.
భారతీయ డ్రైవర్ల కోసం ఉత్పత్తి ప్రారంభం
భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్లా తన స్టాండర్డ్ బ్రాండ్‌ల కార్ల ఉత్పత్తిని జర్మనీలో ప్రారంభించింది. ఎలాన్ మస్క్ కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి చాలా కాలంగా సన్నాహాలు చేస్తోంది. అయితే కార్లపై అధిక దిగుమతి సుంకం టెస్లాకు పెద్ద సమస్య. టెస్లా భారత మార్కెట్లో చైనా కంపెనీలతో నేరుగా పోటీ పడనుంది. బీవైడీ కార్లు భారతీయ మార్కెట్లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చాయి. త్వరలో టెస్లా కూడా ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ
గత నెలలో కొత్త ఈవీ పాలసీని తీసుకురావడం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై కార్ల తయారీ కంపెనీలకు ప్రభుత్వం స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఈ ఈవీ పాలసీ ప్రకారం, భారతదేశంలో ఈవీని తయారు చేయాలనుకునే ఆటోమొబైల్ కంపెనీ కనీసం రూ. 4150 కోట్లు అంటే 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అలాగే ఈ కంపెనీలు కనీసం మూడేళ్లపాటు భారతదేశంలో తమ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కార్లలో ఉపయోగించే భాగాలలో 25 శాతం భారతదేశం నుంచి కొనుగోలు చేయాలి. భారతదేశానికి సరికొత్త ఈవీ టెక్నాలజీని తీసుకురావడం, ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించడం ఈవీ పాలసీ లక్ష్యం.
మరోవైపు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారును లాంచ్ చేయనున్నట్లు టెస్లా ఇటీవలే ప్రకటించింది. టెస్లా రోడ్‌స్టర్ పేరిట ఈ కారు మార్కెట్లోకి రానుంది. ఈ సమాచారాన్ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఎలాన్ మస్క్ ఈ కొత్త రోడ్‌స్టర్ వేగం గురించి కూడా అధికారికంగా ప్రకటించింది. టెస్లా రోడ్‌స్టర్ కారు గంటకు 0 నుండి 60 మైళ్ల వేగాన్ని సెకను కంటే తక్కువ సమయంలో చేరుకోనుండటం విశేషం. అంటే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఒక్క సెకనులోనే ఈ కారు అందుకోనుందన్న మాట.