కార్లలో రకరకాల వేరియంట్లను చూశాం. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. ఇంకో రెండేళ్లలో ఏకంగా స్టీరింగ్ లేకుండా నడిచే కార్లు కూడా రాబోతున్నాయట. వాహన రంగంలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన అమెరికన్ కంపెనీ టెస్లా నుంచి 2023లో స్టీరింగ్ లేకుండా కారు రానున్నట్లు తెలుస్తోంది. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలన్ మస్క్ గతేడాది టెస్లా బ్యాటరీ డే సందర్భంగా ఒక ప్రకటన చేశారు. అతి తక్కువ ధరకే ఫుల్లీ అటానమస్ ఈ-కారును తమ సంస్థ నుంచి తేనున్నట్లు ప్రకటించారు.


మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థ ఆధారంగా రూపొందనున్న ఈ కారు ధర 25000 డాలర్లుగా ఉంది. మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే దీని ధర సుమారు రూ. 18 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. దీని పేరును టెస్లా అధికారికంగా వెల్లడించనప్పటికీ టెక్ నిపుణులు దీనిని మోడల్ 2 అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ కారు స్టీరింగ్ వీల్ లేకుండానే రానుందని లీకులు వస్తున్నాయి. 


స్టీరింగ్ లెస్ వాహనాన్ని 2023లో విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రిక్ (Electrek) అనే పేరున్న వెబ్‌సైట్‌ కథనాన్ని రాసింది. మస్క్ ఇటీవల పలు మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఈ విషయాలను ప్రస్తావించింది. చైనా దేశంలోని షాంఘై నగరంలో ఉన్న గిగా ఫ్యాక్టరీ నుంచి ఈ వాహనాలను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయనున్నట్లుగా కథనంలో పేర్కొంది. అయితే ఈ కారు స్పెసిఫికేషన్లపై టెస్లా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. 


అంత ధర తగ్గించడం సాధ్యమేనా?
టెస్లా కార్ల గురించి వస్తున్న వార్తలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా అంత ధరను తగ్గించడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బ్యాటరీ సెల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా భారం తగ్గుతుందని మస్క్ చాలా కాలం నుంచి ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తున్నారు.


టెస్లా నుంచి రాబోయే కొత్త కార్లపై 50 శాతం వరకు రేట్లు తగ్గించాలనే ఆలోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లాంటి భారీ మార్కెట్ ఉన్న దేశాలపై టెస్లా  కన్నేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా టెస్లా 4 మోడల్ కార్లకు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ఊహాగానాలపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. 


Also Read: CJI NV Ramana: మా మూలాలు బార్ కౌన్సిల్ నుంచే మొదలు... న్యాయవ్యవస్థకు అవే పెద్ద సవాల్... సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ


Also Read: Tokyo Paralympics: బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో రెండు పతకాలు... పసిడి ముద్దాడిన ప్రమోద్ భగత్... కాంస్యంతో మనోజ్ సర్కార్