Tata Punch EV Sales: టాటా మోటార్స్ ఇటీవలే దేశంలో పంచ్ ఈవీని రూ. 10.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాటా భారతదేశం అంతటా పంచ్ ఈవీ డెలివరీని ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో లేదా ఆథరైజ్డ్ టాటా డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 21,000 టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఈ కారు టాప్ స్పెక్ వేరియంట్ ధరను రూ. 14.49 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే ఐదు వేరియంట్‌లలో దీన్ని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. రెండోది 35 కేడబ్ల్యూహెచ్ లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్. ఇది ఏకంగా 421 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందించనుందని కంపెనీ తెలిపింది. ఫాస్ట్‌గా ఛార్జింగ్ ఎక్కే 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ కోసం రూ.50 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సన్‌రూఫ్ వేరియంట్ కావాలన్నా రూ.50 వేలు ఎక్స్‌ట్రాగా సమర్పించుకోవాల్సిందే.
టాటా పంచ్ ఈవీ డిజైన్ ఎలా ఉండనుంది?
కొత్త పంచ్ ఎలక్ట్రిక్ కొత్త లుక్ గురించి చెప్పాలంటే అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫేషియా ఆకర్షణకు పెద్ద కారణం అని చెప్పవచ్చు. ఇది మాత్రమే కాకుండా నెక్సాన్ ఆధారంగా రూపొందిన బోనెట్ వెడల్పుతో పాటు రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్‌తో రిఫ్రెష్ చేసిన బంపర్, గ్రిల్ డిజైన్ కూడా ఈ కారులో అందించారు. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ టాటా పంచ్ ఈవీ ప్రత్యేక ఫీచర్లు. ఛార్జర్‌ను బ్రాండ్ లోగో కింద అందించిన మొదటి టాటా ఎలక్ట్రిక్ కారు పంచ్ ఈవీనే కావడం విశేషం.
కారు వెనుక వైపు గురించి చెప్పాలంటే వై ఆకారంలో బ్రేక్ లైట్లను చూడవచ్చు. ఐసీఈ వేరియంట్ వంటి టెయిల్ లైట్లను కూడా కలిగి ఉంది. ఈ కారు పైకప్పు మీద స్పాయిలర్ అందించారు. టాటా పంచ్ ఈవీలో రీడిజైన్ చేసిన బంపర్ కూడా ఉంది. సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే ఈ కారు కొత్త 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది.
టాటా పంచ్ ఈవీ క్యాబిన్ గురించి చెప్పాలంటే స్టైలిష్ డ్యూయల్ టోన్ థీమ్‌తో అప్‌గ్రేడ్ చేసిన ప్రీమియం అప్హోల్స్టరీని ఈ కారులో చూడవచ్చు. ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ (దీన్ని సఫారీ, హారియర్ కార్లలో చూడవచ్చు), 10.23 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లు కూడా ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్ ఫీచర్లు కూడా అందించారు. దీన్ని బట్టి ఇంటీరియర్ ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ను పోలి ఉంటుందని చెప్పవచ్చు.
టాటా పంచ్ ఈవీ రెండు ఈ-డ్రైవ్ ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఒక వేరియంట్ 120 బీహెచ్‌పీ పవర్, 190 ఎన్ఎం టార్క్‌ను, మరో వేరియంట్ 80 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం టార్క్‌ను డెలివర్ చేయనుంది. ఇందులో పర్మినెంట్ మాగ్నెట్ నాన్ సింక్రోనస్ మోటార్ ఉంది. సెక్యూరిటీ పరంగా చూస్తే అన్ని వేరియంట్‌ల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్, హైడ్రాలిక్ ఫేడింగ్ కాంపన్సేషన్ ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా 360 డిగ్రీ కెమెరా కూడా ఈ కారులో చూడవచ్చు. అయితే ఇది టాప్ స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!