BJP Lok Sabha Election Campaign: లోక్‌సభ ఎన్నికలకు మరి కొద్ది నెలల సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇదే జోష్‌తో లోక్‌సభ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మొదలు పెట్టింది. Modi Ko Chunte Hain పేరుతో ఈ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ప్రత్యేకంగా ఓ పాట కూడా విడుదల చేసింది. "కల కాదు..ఇదే నిజం. మళ్లీ ప్రజలు మోదీనే ఎన్నుకుంటారు" అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పాటను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు బీజేపీ నేతలు. 



హ్యాట్రిక్ పక్కా..? 


ఇప్పటికే వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఇప్పుడు హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. నిజానికి గత రెండు టర్మ్స్ కన్నా ప్రధాని మోదీ చరిష్మా ఈ సారి మరింత పెరిగింది. పైగా అయోధ్య రామ మందిర నిర్మాణంలో (Ayodhya Ram Mandir) మోదీ చూపించిన చొరవ ఆయన క్రేజ్‌ని పెంచేశాయి. అందుకే మూడోసారీ ప్రధానిగా మోదీయే ప్రమాణ స్వీకారం చేస్తారని చాలా ధీమాగా చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. ప్రస్తుతానికి దేశ రాజకీయాల్లో మోదీ స్థాయి వ్యక్తులు కూడా ఎవరూ లేరన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. అటు విపక్ష పార్టీలన్నీ కలిసి I.N.D.I.A పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ...సీట్‌ల పంపకాల విషయంలో సయోధ్య కుదరడం లేదు. కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేదే లేదని ఇప్పటికే మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. అటు ఆప్ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని చూస్తోంది. ఎలా చూసినా ఆ కూటమి ఉందంటే ఉంది కానీ...ఎవరి దారి వారిదే. ఇది ప్రధాని మోదీకి మరింత కలిసొచ్చే అవకాశముంది. బలమైన ప్రతిపక్షం లేకపోవడం బీజేపీ విజయాన్ని ఇంకాస్త సులువు చేయనుంది.


ఓటర్ల దినోత్సవంపై మోదీ..


ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు.  NaMo Nav Matadata Sammelan కార్యక్రమంలో పాల్గొన్నారు. పరివారవాద రాజకీయాల్ని ఓడించే శక్తి ఒక్క ఓటుకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు మోదీ. ఇదే సమయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో దేశ ప్రజలంతా స్కామ్‌లు, అవినీతి గురించి మాట్లాడుకునే వాళ్లని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని అన్నారు. గతంలో భారత్‌ కుదేలైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండేదని ఇప్పుడు బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని తేల్చి చెప్పారు.