Tata Curvv EV Launched in India: ఎంతో కాలం ఎదురుచూపుల తర్వాత దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఎట్టకేలకు టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎంత దూరం వెళ్లవచ్చు?
కంపెనీ రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసింది. ఇది 55 కేడబ్ల్యూహెచ్, 45 కేడబ్ల్యూహెచ్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. దీనితో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. 1.2సీ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో ఈ కారు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. దీని బ్యాటరీని 70 కేడబ్ల్యూ ఛార్జర్‌తో కేవలం 40 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు 585 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్ వెర్షన్ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్
మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో...
టాటా కర్వ్ ఈవీ అనేక అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి రానుందని టాటా మోటార్స్ తెలిపింది. ఇందులో కంపెనీ 123 కేడబ్ల్యూ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించింది. ఈ ఎస్‌యూవీ కేవలం 8.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
మరో ఎలక్ట్రిక్ కారుతో కూడా ఛార్జ్ చేయవచ్చు
కంపెనీ నెక్సాన్ తరహాలో కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను టాటా కర్వ్‌లో అందించింది. ఇది వెహికల్ టు వెహికల్ (V2V), వెహికల్ టు లోడ్ (V2L) ఫంక్షన్‌లను కూడా కలిగి ఉంది. వీ2వీ సిస్టమ్ సహాయంతో మీరు ఒక ఎలక్ట్రిక్ కారును మరొక ఎలక్ట్రిక్ కారుతో ఛార్జ్ చేయవచ్చు. వీ2ఎల్ సాయంతో మీరు మీ కారు నుంచి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు పవర్ ఇవ్వవచ్చు. ఈ కారులో Arcade.ev టెక్నాలజీని అమర్చారు. ఇది కాకుండా కంపెనీ టాటా ఈవీ ఒరిజినల్స్‌ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు కంపెనీ అధికారిక యాక్సెసరీస్‌ను కొనుగోలు చేయవచ్చు.
Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి