V-Strom 800 DE: సాంకేతిక సమస్యల కారణంగా 400,000కు పైగా సుజుకి స్కూటర్‌లను సుజుకి రీకాల్ చేసింది. వెనక్కి పిలిచిన స్కూటర్లలో యాక్సెస్ 125, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125, అవెనిస్ 125 స్కూటర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లలో పలు సమస్యలు వస్తున్నట్లు  సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా గుర్తించింది. ఏప్రిల్ 30, 2022 నుంచి డిసెంబర్ 3, 2022 మధ్య తయారు చేయబడిన 4 లక్షలకుపై  స్కూటర్లను రీకాల్‌ చేయనున్నట్లు స్పష్టం చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..


రీకాల్ చేసిన స్కూటర్లలో యాక్సెస్ 125 263,788 యూనిట్లు, బర్గ్‌మాన్ స్ట్రీట్ 125 72,025 యూనిట్లు చివరగా Avenis 125 52,578 యూనిట్లు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. వీటితో పాటు వీ-స్ట్రోమ్‌ (V-Strom 800 DE) మోటార్‌ సైకిల్‌ని కూడా రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది. దీనికి గల సమస్యను సుజుకి ఇండియా వివరణ ఇచ్చింది. 

సమస్య:
ఇగ్నీషన్‌ కాయిల్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన హై-టెన్షన్ కోర్డ్‌ (High-tension Cord)లో సమస్య ఉన్నట్లు సుజుకి వెల్లడించింది. స్కూటర్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఈ కోర్డ్‌లు పదే పదే వంగడం వల్ల పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా వివరించింది. లీకైన హై-టెన్షన్  కోర్డ్‌కి నీరు తగిలినప్పుడు స్పీడ్ సెన్సార్లు, థొరెటల్ పొజిషన్ సెన్సార్లు దెబ్బతిన్నట్లు గుర్తించామని సుజుకి పేర్కొంది. ఈ సమస్యలను తొలగించేందుకు రీకాల్‌ చేస్తున్నట్లు సుజుకి  స్పష్టం చేసింది. 


V-Strom 800DE రీకాల్:
వీ స్ట్రోమ్‌ 800 డీఈ
బైక్ కూడా రీకాల్ లిస్ట్‌లో ఉంది. అయితే ఈ మోడల్ సమస్య స్కూటర్లలో తలెత్తే లోపాలతో సంబంధం లేదు. మే 5, 2023 నుంచి ఏప్రిల్ 23, 2024 మధ్య తయారు చేయబడిన ఈ బైక్‌లలో వెనుక టైర్ పొజిషనింగ్‌లో లోపం ఉన్నట్లు సుజుకి పేర్కొంది. దీనివల్ల టైర్‌ థ్రెడ్స్‌లో పగుళ్లు లేదా వంపులు వల్ల టైర్ స్ట్రక్చర్ నుంచి విడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తద్వారా వాహన పూర్తి రైడింగ్‌ డైనమిక్స్‌ పూర్తిగా ప్రభావితం అవుతాయని చెప్పింది. ఈ సమస్యను పరిష్కరించడానికి వెనుక టైర్‌ల పొజిషనింగ్‌ మారిస్తే సరిపోతుంది తెలిపింది. అయితే కేవలం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మోటార్‌సైకిళ్లలోను కూడా రీకాల్ చేసినట్లు సుజుకి వెల్లడించింది. 


ఆందోళన అవసరం లేదు:
అయితే రీకాల్ చేసిన స్కూటర్లపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వినియోగదారులకు సుజుకి భరోసా ఇచ్చింది. చిన్నపాటి సర్దుబాట్లు  చేయడం ద్వారా పూర్తిగా సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పింది. రీకాల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం డీలర్‌షిప్స్ ద్వారా త్వరలో అందించబడుతుందని పేర్కొంది. ఈ సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించడం ద్వారా కస్టమర్లకు బ్రాండ్ వాల్యూపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామి ఇచ్చింది.


బ్రాండింగ్‌పై మచ్చ:
రీకాల్‌ అనివార్యమైన సందర్భాల్లో కంపెనీలు ఉత్పత్తులను వెనక్కి పిలుస్తాయి. ఇదే సంఘటన సుజుకి కూడా చేసింది. గతంలోనూ పలు కంపెనీలు రీకాల్‌ చేసి పొరపాట్లను సరిదిద్దాయి. సుజుకి నుంచి యాక్సెస్‌, బర్గ్‌మాన్‌ స్కూటర్లు మంచి మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నాయి. కీలకమైన ఉత్పత్తుల్లో ఈ సాంకేతిక సమస్యలు ఉత్ఫన్న అవ్వడం వల్ల బ్రాండ్ నుంచి వచ్చే ఇతర ఉత్పత్తులపై కస్టమర్లు నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.