Rolls Royce Spectre Electric: లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన మొదటి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టర్‌తో భారతీయ మార్కెట్‌లోని ఈవీ విభాగంలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రోల్స్ రాయిస్ స్పెక్టర్ ధరను కంపెనీ రూ.7.5 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) ఉంచింది. స్పెక్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ భారతదేశంలోని కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.


రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఇంజిన్ ఎలా ఉంది?
ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కోసం 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది ప్రతి యాక్సిల్‌పై రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో పెయిర్ అయింది. ఇది 585 బీహెచ్‌పీ పవర్‌ను, 900 ఎన్ఎం మిక్స్‌డ్ అవుట్‌పుట్‌ను జనరేట్ చేయగలదు. ఇది 195 కేడబ్ల్యూ ఛార్జర్‌ను కలిగి ఉంది. ఇది కేవలం 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కానుంది. ఇది కాకుండా ఆప్షనల్‌గా 50 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్ కూడా ఉంది, ఇది 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి 95 నిమిషాలు పడుతుంది.


రోల్స్ రాయిస్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. అంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 530 కిలోమీటర్ల పాటు ప్రయాణించవచ్చన్న మాట. స్పెక్టర్ ఎలక్ట్రిక్ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.


రోల్స్ రాయిస్ స్పెక్టర్ ప్లాట్‌ఫారమ్ వివరాలు ఏంటి?
ఈ ఈవీ బరువు 2,890 కిలోలుగా ఉంది. ఇది ఆల్ అల్యూమినియం స్పేస్‌ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై బిల్డ్ చేశారు. ఇప్పటికే ఉన్న ఫాంటమ్, కల్లినన్, ఘోస్ట్ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లో డెవలప్ చేశారు. రోల్స్ రాయిస్ స్పెక్టర్ పొడవు 5,475 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 2,017 మిల్లీమీటర్లుగా ఉంది.


రోల్స్ రాయిస్ స్పెక్టర్ ఇంటీరియర్
ఇంటీరియర్స్ గురించి చెప్పాలంటే ఇది వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీ, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ ప్రీమియం ఇంటీరియర్స్, డోర్లు, డ్యాష్‌బోర్డ్‌పై ఇల్యూమినేటెడ్ ప్యానెల్‌లు, అప్హోల్స్టరీ, ఇంటీరియర్ ప్యానెల్స్ కోసం కస్టమైజేషన్ ఆప్షన్లతో వస్తుంది.


రోల్స్ రాయిస్ కొత్త సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ స్పిరిట్ ఈ ఎలక్ట్రిక్ సెడాన్ లోపలి భాగంలో చూడవచ్చు. ఇప్పుడు ఇది కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉన్న ఇంటర్‌ఫేస్‌తో రానుంది. దీని కారణంగా వెహికిల్‌ను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు.


స్పెక్టర్ ఎలక్ట్రిక్ కూపేలో విస్తృత ఫ్రంట్ గ్రిల్, అల్ట్రా స్లిమ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు (డీఆర్ఎల్స్), బోల్డ్ షోల్డర్ లైన్‌లు, స్లోపింగ్ రూఫ్‌తో కూడిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ కారణంగా ఏరో-ట్యూన్డ్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీని కలిగి ఉంది. 23 అంగుళాల ఏరో ట్యూన్డ్ వీల్స్, వెనుకవైపు ఏరోడైనమిక్ గ్లాస్‌హౌస్, నిలువుగా ఉండే టెయిల్‌ల్యాంప్‌లు దీన్ని మరింత ప్రీమియంగా చేస్తాయి. రోల్స్ రాయిస్ అనేది ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటి. దీని కార్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుంది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!