Ola Plans To Launch 4 Electric Motorcycles: దేశీయ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ఓలా, సరికొత్త మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త బైకులను విడుదల చేస్తున్న ఈ కంపెనీ మల్టీఫుల్ మోడళ్లను పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ కొత్త బైకుల గురించి బయటకు చెప్పకపోయినా, ఓలా ఇటవల SEBIకి అందించిన డాక్యుమెంట్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఓలా కంపెనీ నాలుగు మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు SEBIకి సమర్పించిన డాక్యుమెంట్స్ లో వివరించింది. ఇప్పటికే ఈ మోడళ్లకు సంబంధించిన అన్ని ప్రయోగాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఉత్పత్తి మొదలు పెట్టేందుకు ఫైనల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓలా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో నాలుగు మోడళ్లకు సంబంధించిన కాన్సెప్టులను వెల్లడించింది. త్వరలోనే ఆసక్తి ఉన్న వినియోగదారులు కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
ఓలా నుంచి రాబోతున్న 4 బైకులు ఇవే!
ఓలా వెల్లడించిన కాన్సెప్ట్ డెబ్యూలో నాలుగు బైకుల పేర్లను వెల్లడించింది. వాటిలో ఓలా డైమండ్ హెడ్, ఓలా రోడ్ స్టర్, ఓలా అడ్వెంచర్, ఓలా క్రూయిజర్ ఉన్నాయి. ఈ నాలుగు ఎలక్ట్రిక్ బైకులను 2024 చివరి నాటికి లాంచ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త బైకులకు సంబంధించి ఆగష్టులో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో బైకు ఫీచర్లు, ధరకు సంబంధించి ఓ క్లారిటీ రానుంది. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు 2026 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో డెలివరీలు మొదలు పెట్టే అవకాశం ఉంది.
పెరగనున్న బ్యాటరీ రేంజ్, టాప్ స్పీడ్
రాబోయే ఎలక్ట్రిక్ బైకులను అత్యాధునిక టెక్నాలజీ సాయంతో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న బైకులకు పూర్తి భిన్నంగా కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా వీటిని తయారు చేసే అవకాశం ఉంది. మోటార్ సైకిల్ లైనప్, బ్యాటరీ, రేంజ్, మోటర్, టాప్ స్పీడ్, ఫీచర్ల గురించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినా, ప్రస్తుతం బైకులతో పోల్చితే అన్ని అంశాలు మెరుగ్గానే ఉండే అవకాశం ఉంది. మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల మధ్య పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో భవిష్యత్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ శ్రేణిని తయారు చేయనుంది.
త్వరలో పూర్తి వివరాలను వెల్లడించనున్న ఓలా
త్వరలోనే ఓలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనుంది. ఆయా మోడళ్ల ధరలు, బుకింగ్ అమౌంట్, స్పెసిఫికేషన్లు, అధికారిక డెలివరీ షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ సరికొత్త బైకులతో ఎలక్ట్రిక్ మోటార్ మార్కెట్ లో మరింత దూసుకెళ్లాలని ఓలా భావిస్తోంది. ఇప్పుడున్న బైకులకు భిన్నంగా ఓలా బైకులను తయారు చేస్తే తప్పకుండా మంచి మార్కెట్ వాటాను సంపాదించుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూపర్ - భారత్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?
Also Read: ‘గ్రాండే పాండా’ను రివీల్ చేసిన ఫియట్ - వావ్ అనిపిస్తున్న కొత్త కారు!